NTV Telugu Site icon

బిగ్ బాస్ హౌస్ లో ‘ఆ గట్టునుంటావా… ఈ గట్టునుంటావా’!

Bigg-Boss-5

Bigg-Boss-5

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 పై సోషల్ మీడియాలోనూ, ఛానెల్స్ లోనూ ప్రతికూల వార్తలు జోరందుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ షోపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు గేమ్ లో పూర్తిస్థాయిలో లీనమై పోయి, ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతిదాడులూ చేసుకోవడం మొదలెట్టేశారు. ఆడ, మగ అనే తేడా లేకుండా, నియమ నిబంధనలను పాటించకుండా, అసభ్య పదజాలంతో మాటల యుద్ధాలకు దిగడంతో… బుధవారం ఒకానొక సమయంలో బిగ్ బాస్ గేమ్ ను హోల్డ్ లో పెట్టేశాడు. సభ్యులందరి మధ్య ప్రశాంతత చేకూరిన తర్వాత మరో ఆటను ప్రారంభించాడు. ‘ఆ గట్టునుంటావా… ఈ గట్టునుంటావా’ అనే ఆట మాత్రం కాస్తంత ఆసక్తికరంగానే సాగింది. చక్రాలు ఉన్న బల్ల మీద కూర్చుని, సభ్యులు అవతలి వైపు ఉన్నతమ తమ డగ్గౌట్స్ దగ్గరకు చేతితో తోసుకుంటూ ముందు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరు చేరిన తర్వాత ఆ చక్రాల బల్లను తాడు సాయంతో వెనక్కి లాగి మరొకరు వెళతారు. అలా ఏ టీమ్ సభ్యులంతా ముందుగా డగ్గౌట్స్ లోకి చేరితే వారు విజేత అవుతారు. కాస్తంత సన్నగా ఉన్న వ్యక్తులు, కండబలం ఉన్నవాళ్ళు బల్ల మీద కూర్చుని… దానిని చేతులతో ముందుకు జరుపుతూ బాగాపూ సాగారు. కానీ ఉమాదేవి లాంటి వారికి ఈ ఆట గట్టి పరీక్షే పెట్టింది. ముందు రోజు అనారోగ్యానికి గురైన లోబో ఈ ఆటలో పాల్గొనలేదు. ఈ గేమ్ లో శ్రీరామచంద్రకు చెందిన ఈగల్స్ టీమ్ విజయం సాధించింది.

మౌనముని పాత్రలో బిగ్ బాస్!
నిన్నటి గేమ్ లో భాగంగా చిన్న పిల్లోస్ ను సంపాదించడం, వాటిని జాగ్రత్తగా కాపాడుకునే క్రమంలో రెండో రోజు కూడా సభ్యులు అరుపులు, కేకలు కొట్లాటకు దిగారు. కెప్టెన్ సిరి ఉద్దేశ్యపూర్వకంగానే తన గొంతును పెంచి మాట్లాడుతూ, ఎదుటి వ్యక్తులను డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తోందనేది అందరికీ అర్థమైపోతోంది. ఇక సౌమ్యుడిగా పేరున్న శ్రీరామచంద్ర సైతం ఈ గేమ్ లో తన కండబలంతో పాటు వాయిస్ పవర్ కూడా చూపించాడు. ఉమా, శ్వేత వర్మ ఈ గేమ్ ను కాస్తంత సీరియస్ గానే తీసుకున్నారు. ఎదుటి టీమ్ సభ్యుల మీద గట్టిగానే దాడిచేసి పిల్లోస్ ను గుంజుకునే ప్రయత్నం చేశారు. ‘హౌస్ లో ఎటువంటి హింసకూ తావులేదు’ అని బిగ్ బాస్ చెప్పినా, ఆ మాటలను పెడ చేవిన పెట్టారు. చిత్రం ఏమంటే… గతంలో ఎవరైనా నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారికి ఏదో ఒక శిక్ష వేసే బిగ్ బాస్ ఈసారి మౌనముని పాత్ర పోషించాడు. అలానే ‘ఇది తెలుగు కార్యక్రమం… సభ్యులు తెలుగులోనే మాట్లాడాలి’ అని గతంలో బిగ్ బాస్ పదే పదే చెప్పేవాడు. తెలుగు రాని వారు కనీసం నేర్చుకోని లేదా పక్క సభ్యుల సహకారం తీసుకుని తెలుగులో మాట్లాడమనే వాడు. కానీ ఈసారి ఆ ఊసే ఎత్తడం లేదు. దాంతో అత్యధిక సభ్యులు ఇంగ్లీష్ లోనూ, యాని మాస్టర్ వంటి వారు హిందీలోనూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలెట్టారు. ఇక దొంగలున్నారు జాగ్రత్త గేమ్ లో ఓ పిల్లో డామేజ్ అయ్యిందని ఒకరు; కాలేదని మరొకరు బిగ్ బాస్ ముందు తమ వివాదాన్ని పెట్టినా… ఆయనేమీ స్పందించలేదు. చివరకు తమ తమ సభ్యులతో చర్చించి, టీమ్ లీడర్సే ఫైనల్ డెసిషన్ కు వచ్చారు. ఈ రోజు కూడా ఉమా దేవికి, యాని మాస్టర్ కూ తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. సన్నీ, శ్వేత, విశ్వ వంటి వారు గేమ్ పూర్తయిన తర్వాత ఎందుకు తాము రూడ్ గా ప్రవర్తించాల్సి వచ్చిందో చెబుతున్నారు కానీ… యాని, ఉమా మాత్రం తమ మధ్య ఆ గ్యాప్ ను అలానే కంటిన్యూ చేస్తున్నారు.

కెప్టెన్ ఎంపిక మరో రోజు ఆలస్యంగా!
బిగ్ బాస్ ఆడించిన దొంగలున్నారు జాగ్రత్తలో ఊల్ఫ్ – ఈగల్ టీమ్స్ సరిసమానంగా పిల్లోస్ ను దక్కించుకున్నాయి. దాంతో ఇద్దరికీ చెరొక ఐదు ఫ్లాగ్స్ ను ఇచ్చారు. ఈ రెండు ఆటలు, అందులోని విజేత జట్టు ఆధారంగా రెండోవారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ ను ఎంపిక చేస్తామని బిగ్ బాస్ చెప్పాడు. అయితే… ఈ రెండు ఆటల్లోనూ ఇద్దరూ విజయాన్ని సాధించడంతో బిగ్ బాస్ మరో గేమ్ ను పెట్టి, కెప్టెన్ ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో కెప్టెన్ ఎంపిక మరో రోజు ఆలస్యమైంది. పదకొండో రోజున కెప్టెన్సీ ఎంపిక జరిగే ఆస్కారం కనిపిస్తోంది. మొత్తం మీద బయట బిగ్ బాస్ హౌస్ పై జరుగుతున్న రచ్చకు తగ్గట్టుగానే రోజు రోజుకూ అక్కడ హౌస్ లోనూ పార్టిసిపెంట్స్ అతిగా ప్రవర్తించడం మరింత చర్చనీయాంశమౌతోంది. ఓవర్ ఆల్ గా ఈ గేమ్ లో జరిగిన ఓవర్ యాక్షన్ గురించి వీకెండ్ లో నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి.