NTV Telugu Site icon

బిగ్ బాస్ షో లో చెర్రీ స్వామి కార్యం… స్వకార్యం!

Bigg Boss 5 Sep 18th Episode

బిగ్ బాస్ సీజన్ – 5 లో సెప్టెంబర్ 18వ తేదీ హౌస్ మేట్స్ కు ఓ స్పెషల్ డే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… శనివారం నాగార్జునతో కలిసి డయాస్ ను షేర్ చేసుకున్నాడు. అయితే చెర్రీ బిగ్ బాస్ షో లో పాల్గొనడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. అతను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను నాగార్జున బిగ్ బాస్ షో లో విడుదల చేశారు. అంతే కాదు… ప్రోమోలో చెర్రీ చాలా హాండ్సమ్ గా ఉన్నాడంటూ నాగ్ కితాబిచ్చాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ కార్యక్రమాన్ని రామ్ చరణ్ తోనే జూనియర్ ఎన్టీయార్ ప్రారంభించాడు. దానికి మంచి టీఆర్పీ వచ్చింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో కు సైతం చెర్రీ రావడంతో ఈ వారం ఈ కార్యక్రమం టీఆర్పీ సైతం భారీగా ఉండే ఆస్కారం ఉంది. చెర్రీ స్వామికార్యం స్వకార్యం కూడా ఈ షోలో పూర్తి చేసుకున్నాడు.

బిగ్ బాస్ షోకు ‘మాస్ట్రో’ టీమ్!
ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘మాస్ట్రో’ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ హీరోహీరోయిన్లు నితిన్, నభా నటేశ్ తో పాటు కీలక పాత్ర పోషించిన తమన్నాను సైతం బిగ్ బాస్ షోకు తీసుకొచ్చి… సినిమా గురించి వారి మనసులోని మాటలు అడిగి తెలుసుకున్నాడు. పనిలో పనిగా బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులతోనూ మన టీవీ ద్వారా చెర్రీ కాసేపు ముచ్చటించాడు. తాను ఇవాళ లోబో తరహాలో డ్రస్సింగ్ చేసుకున్నానని చెప్పిన రామ్ చరణ్, ఆర్జే కాజల్ ను అందరూ పనిమనిషిగా చూడటాన్ని తప్పుపట్టాడు. పనిమనిషి అంటే పనిమంతురాలు అనుకోవాలని కాజల్ ను ఓదార్చాడు. అయితే మాటలు తగ్గించి, పని చేయాలన్నది హౌస్ మేట్స్ ఒపీనీయన్ కావచ్చునంటూ కాజల్ కు చిన్నపాటి చురకా అంటించాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంకతో ఫోటో దిగుతానని చెర్రీ హామీ ఇచ్చాడు. తన అక్కయ్య సంగీత్ కు యానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయాన్ని రామ్ చరణ్‌ గుర్తు చేసుకున్నాడు. ఇక సింగర్ శ్రీరామచంద్రను రామ్ చరణ్ పాట పాడమని కోరగానే… అతను బంగారు కోడిపెట్ట సాంగ్ అందుకున్నాడు.

హద్దు మీరిన వారిని సెట్ చేసిన కింగ్ నాగ్!
రామ్ చరణ్ తో హౌస్ మేట్స్ అంతా చాలా ఉల్లాసంగా గడిపారు. అయితే ముందుంది మొసళ్ళ పండగ అంటూ నాగార్జున వారికి విరామానికి ముందో చిన్నపాటి హెచ్చరిక చేశాడు. దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత హౌస్ మేట్స్ ఎవరెవరు తప్పు చేశామని అనుకుంటున్నారో వారిని నుంచోమన్నాడు నాగ్. వారు చేసిన తప్పుల్ని వారి నోటి వెంటే చెప్పించాడు. బూతులు మాట్లాడినందుకు ఉమాతో సారీ చెప్పించడంతో పాటు మూడు గుంజిళ్ళూ తీయించాడు నాగార్జున. ఇక లోబోలో ప్రాయశ్చిత్తాన్ని గమనించిన నాగ్ అతన్ని క్షమించేశాడు. అయితే… సిగరెట్లు తాగడం బంద్ చేయమని కోరాడు. అందుకు లోబో కూడా అంగీకరించడం విశేషం. ఇక నామినేషన్ సమయంలో హమిదా, లోబో ముఖాలపై రంగును గట్టిగా కొట్టిన శ్వేతవర్మ… సారీ చెప్పి… తన ముఖాన్ని తానే కొట్టుకుంది. సన్నీ విషయంలో తప్పుగా మాట్లాడిన సిరికి నాగార్జున అప్పటి విజువల్స్ చూపించి, ఆరోజు అసలేం జరిగిందో వివరించాడు. విషయం అర్థం చేసుకున్న సిరి… సన్నీకి హగ్ ఇచ్చి సారీ చెప్పింది. ఎదుటి వారి క్యారెక్టర్ ను అసాసినేషన్ చేసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిరికి చెప్పాడు నాగార్జున.

గర్ల్స్ గాచిప్స్ – బాయ్స్ గుసగుస!
బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు చెప్పుకునే గాచిప్స్, అబ్బాయిల గుసగుసల మీద కూడా నాగార్జున ఓ కన్ను, చెవి వేశాడు. శ్రీరామ్ అందరినీ కవర్ చేస్తున్నాడంటూ జెస్సీ, షణ్ముఖ్ గుసగుసలాడటాన్ని నాగ్ గమనించాడు. అలానే… లోబో, ఉమా బెడ్ రూమ్ ప్రేమాయణాన్ని కీన్ గా అబ్జర్వ్ చేశాడు. హౌస్ లో ఫన్ అండ్ రొమాన్స్ కు తక్కువ లేదని, అయితే గడిచిన వారంలో సభ్యుల మధ్య క్రమశిక్షణ లోపించిందని నాగ్ అభిప్రాయపడ్డాడు. తనకు బయటి నుండీ వచ్చిన ఫీడ్ బ్యాక్ లోనూ అదే ఆరోపణలు ఉన్నాయని సభ్యులకు చెప్పాడు. దానికి తగ్గట్టుగానే నాగ్ వారిని సెట్ చేయడం విశేషం.

ఎవరికి చెక్ చెబుతారో!?
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ ఎలిమినేషన్ ఫస్ట్ స్టేజ్ లో శనివారం ముగ్గురు సేవ్ అయ్యారు. రెండో వారంలో ఏడుగురు నామినేట్ కాగా వారిలో లోబో, యాని, ప్రియాంక… ఈ రోజు కార్యక్రమం పూర్తి అయ్యే సరికీ సేఫ్ జోన్ లోకి వెళ్ళి ఊపిరి పీల్చుకున్నారు. తాను సేవ్ అయినా… తన పొట్టీ (ఉమాదేవి) ఇంకా డేంజర్ జోన్ లోనే ఉండటం లోబోను కాస్తంత నీరసపర్చింది. ఆదివారం ఉమ, నటరాజ్, యాని, కాజల్, ప్రియలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే… అందరి చూపులు ఉమ అండ్ నటరాజ్ మాస్టర్ పై ఉన్నాయి.