బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం నాగార్జున కంటెస్టెంట్ శ్రీరామ్ ను చాలా ఇరకాటాన పెట్టేశాడు. ‘నీకు బిగ్ బాస్ టైటిల్ ప్రధానమా? హమీదా ప్రధానమా?’ అని డైరెక్ట్ గా అడిగేశాడు. రెండు కళ్ళలో ఏది ప్రధానం అంటే ఏం చెబుతాం! శ్రీరామ్ పరిస్థితి అదే అయ్యింది. అయితే బిగ్ బాస్ షోకి రావడం వల్లే హమీదా పరిచయం అయింది కాబట్టి, మొదట తన ప్రాధాన్యం బిగ్ బాస్ టైటిల్ కే అని, ఆ తర్వాతే హమీదా అని బదులిచ్చాడు శ్రీరామ్. దాంతో హమీదా మీద అతని ప్రేమ హంబక్కే అని తేటతెల్లమైపోయింది. శనివారం నాగార్జున హౌస్ లోకి ఎంటర్ కావడంతోనే సభ్యులను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. మరీ ముఖ్యంగా ఏకంగా ఎనిమిది మంది నామినేట్ చేసిన తర్వాత షణ్ముఖ్ లో వేడి పుట్టిందని, అలానే అది పచ్చి మిర్చి తిన్న ప్రభావం కూడా అని నాగ్ ఆటపట్టించాడు. ఇక అడ్డాలో కూర్చుని అందరి గురించి చర్చించే నీకు ఇతరులను విమర్శించే హక్కులేదంటూ సిరికి క్లాస్ పీకాడు. అదే తరహాలో జెస్సీని కూడా ఓ గ్రూప్ తో కలిసిపోవడం కరెక్ట్ కాదని చెప్పాడు. కిచెన్ లో జరిగిన గొడవను షణ్ముఖ్, సిరికి మాత్రమే చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించాడు. ఆ రకంగా ఇంటి సభ్యులందరికీ నాగ్ దాదాపు క్లాస్ పీకాడు. ఒక్క ప్రియాంకను మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. బిగ్ బాస్ ద్వారా జీవితాన్ని బాగు చేసుకున్న వారికి ప్రియాంక ఓ లివింగ్ ఎగ్జాంపుల్ అని నాగార్జున చెప్పడం విశేషం.
బిగ్ బాస్ వేదికపై వైష్ణవ్ అండ్ క్రిష్!
వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘కొండపొలం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నాగార్జున ఆ మూవీ హీరో వైష్ణవ్ ను, డైరెక్టర్ క్రిష్ ను బిగ్ బాస్ వేదిక పైకి తీసుకొచ్చాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పరిచయం చేశాడు. సభ్యులను అడిగి, కడిగే క్రమంలో నాగార్జున క్రిష్, వైష్ణవ్ తేజ్ సాయం కూడా తీసుకున్నాడు. దాంతో ప్రియాంక, లోబో, కాజల్, శ్వేత, ప్రియా, యాని తదితరులను వీరిద్దరూ కొన్ని ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టారు. ఇదే సమయంలో నాగార్జున కాజల్ కు లోబో మిడిల్ ఫింగర్ చూపాడా లేదా అనే విషయంలో క్లారిటీ ఇచ్చాడు. నమాజ్ చేసిన నోటితో అబద్ధం చెప్పనని లోబో అన్నమీదట నాగార్జున ఆ మాటలను విశ్వసిస్తూ, ఇక ఆ వివాదానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయమని కాజల్ ను కోరాడు.
దీనికి ముందు బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా చేసి, రెనో కైగర్ కారుకు సంబంధించిన ఫీచర్స్ తెలిపి, ఓ క్విజ్ ను నిర్వహించారు. అందులో ప్రియా టీమ్ విన్ అయ్యింది. ఇదిలా ఉంటే… ఉదయమంతా జైల్లోనే ఉన్న కాజల్ మధ్యాహ్నంకు బయటకు వచ్చింది. కాజల్ జైలుకు వెళ్ళగానే ఆమె గురించి రవి, మానస్ కాస్తంత డీప్ గా చర్చించుకున్నారు. ఆమె వ్యవహార శైలి తనకు నచ్చలేదని రవి చెప్పిన మాటలను, మానస్ తిరిగి కాజల్ దగ్గరకొచ్చి చెవిలో ఊదాడు. ‘నువ్వు సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నావని రవి భావిస్తున్నా’డంటూ కాజల్ కు చెప్పాడు.
రవిని రూలర్ గా గుర్తించిన మెజారిటీ మెంబర్స్
బిగ్ బాస్ లో శనివారం నాగార్జున ఓ గేమ్ ఆడించారు. ఇంటి సభ్యులంతా గడిచిన వారం రోజుల ప్రవర్తనను బేరీజు వేసుకుంటూ ఒకరిని రూలర్ గా, మరొకరిని స్లేవ్ గా ఎన్నుకోమని కోరాడు. దానిలో అత్యధికంగా ఐదు మంది (ప్రియాంక, షణ్ముఖ్, జస్వంత్, సిరి, విశ్వ) రవిని రూలర్ గా ఎన్నుకున్నారు. మానస్ ను ముగ్గురు (రవి, సన్నీ, హమీదా) రూలర్ గా డిక్లేర్ చేశారు. అలానే సన్నీని కూడా ముగ్గురు (మానస్, లోబో, యాని మాస్టర్) రూలర్ గా ప్రకటించారు. ఇక కాజల్ ను ఇద్దరు, ప్రియను ఒకరు రూలర్ గా చెప్పారు.
స్లేవ్ ఎంపికలో మాత్రం చాలామంది చాలా కారణాలతో ఎక్కువ మందిని ఎంపిక చేశారు. లోబోను ప్రియాంక, జెస్సి, యాని మాస్టర్ స్లేవ్ గా పేర్కొన్నారు. అలానే హమీదాను స్లేవ్ గా ప్రియా, మానస్, షణ్ముఖ్ పరిగణించారు. మిగిలిన వారి వివరణ ఎలా ఉన్నా… గత వారం తనకు హౌస్ లో కేవలం 14 మంది పార్టిసిపెంట్స్ మాత్రమే కనిపించారని, హమీదా కనిపించలేదంటూ షణ్ముఖ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. దానికి హమీదా తనదైన శైలిలో బదులిచ్చింది. విశ్వను స్లేవ్ గా లోబో, సన్నీ ప్రకటించారు. ఇక షణ్ముఖ్, ప్రియాంక, మానస్, శ్రీరామ్, ప్రియ, రవి లను ఒక్కొక్కరు స్లేవ్స్ గా పేర్కొన్నారు. అయితే… రూలర్ – స్లేవ్ ఎంపికలో ప్రియా – విశ్వకు మధ్య మళ్ళీ మాటల యుద్ధం జరిగింది. రేషన్ మేనేజర్ గా విశ్వ నూరు శాతం ఎఫెర్ట్ పెట్టడం లేదంటూ ప్రియా మరోసారి ఆరోపణ చేసింది. దాంతో నాగార్జున కెప్టెన్ కు ఆర్.ఎం.కు మధ్య సమన్వయం ఉండాలని, లేకపోతే సభ్యులంతా ఇబ్బంది పడతారని హితవు పలికారు. విశేషం ఏమంటే… ప్రతి శనివారం బిగ్ బాస్ హౌస్ లోంచి ఎలిమినేషన్స్ లో ఉన్న ఒకరిద్దరిని సేవ్ చేసే నాగార్జున ఈసారి మాత్రం ఎలిమినేషన్స్ ప్రక్రియ మొత్తం ఆదివారమే జరుగుతుందని చెప్పారు.
హమీదా ఎలిమినేట్ కాబోతోందా!?
నాగార్జున బిగ్ బాస్ హౌస్ మేట్స్ దగ్గరకు వచ్చి రావడంతోనే శ్రీరామ్ ను ‘బిగ్ బాస్ – హమీదాలో ఎవరి పక్షం?’ అని అడిగిన దానిని బట్టి, ఈసారి హమీదా ఎలిమినేట్ అవ్వబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగుతోంది. ఆమెను పంపడానికే నాగ్ ఆ రకమైన హింట్ ఇచ్చడని అంటున్నారు. పైగా శ్రీరామ్ – హమీదా మధ్య వ్యవహారం కాస్తంత శ్రుతి మించుతున్నట్టుగానూ బిగ్ బాస్ నిర్వాహకులకు ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కొంతకాలంగా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్, అందులో వారి ప్రవర్తన పై విమర్శకులు వేయి కళ్ళు పెట్టుకుని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాలుగా పెరిగిన సాన్నిహిత్యంతో శ్రీరామ్, హమీదా గీతను దాటుతున్నట్టుగా బిగ్ బాస్ గ్రహించాడని అంటున్నారు. అందుకే హమీదాను ఈసారి బయటకు పంపబోతున్నారని తెలుస్తోంది. పైగా మిగిలిన కంటెస్టెంట్స్ ఎనిమిది మందితో పోల్చితే, హమీదానే వీక్ పర్శన్. అలానే ఇంతవరకూ గ్రూపిజాన్ని చూసీ చూడనట్టు వదిలేసిన బిగ్ బాస్ ఇక మీదట ఆ రకమైన వైఖరిని మొదటిలోనే తుంచాలనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బాగా క్లారిటీతో ఉంది మానస్ ఒక్కడే. ప్రియాంక తనకు దగ్గర కావాలని ప్రయత్నించిన ప్రతిసారీ మానస్.. ఉద్దేశ్యపూర్వకంగా, తెలివిగా ఆమెతో కొంత డిస్టెన్స్ మెయిన్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె కారణంగా ఎవరితోనూ మాట పడటం తనకు ఇష్టం లేదని మానస్ ప్రియతో చెప్పడానికి కూడా కారణం అదే! మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా హమీదా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందో లేదో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకూ ఆగాల్సిందే!