బిగ్ బాస్ హౌస్ లో 51వ రోజు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. హౌస్ మేట్స్ కు వచ్చిన లేఖలు క్రష్ కావడం తట్టుకోలేకపోయిన సన్నీ, కాజల్ ముందు రోజు రాత్రి కన్నీటి పర్యంతం అయ్యారు. విశ్వ తన కొడుకు రాసిన లెటర్ చదువుకునే ఛాన్స్ ఇవ్వమని అడగడంతో కాదనలేకపోయానని సిరి చెబుతూ, తనకూ ఇలా లెటర్ రావడం మొదటిసారి అని షణ్ముఖ్ తో గుసగుసలాడింది. లెటర్ రాగానే ముందు కన్నీళ్ళు పెట్టుకుని డ్రామా చేయాలంటూ షణ్ణు చెప్పడం విశేషం. అది తమవల్ల కాదని చివరకు అతను ముక్తాయింపు ఇచ్చాడు.
ముగ్గురు బావల మరదలు ప్రియాంక!
51వ రోజు ఉదయమే రవి, లోబో ప్రియాంకను ఆటపట్టించడం మొదలు పెట్టారు. హౌస్ లో ప్రియాంకకు ముగ్గురు బావలు ఉన్నారని, ఏ బావకు బాధ కలిగినా ప్రియాంక తట్టుకోలేదని రవి అన్నాడు. శ్రీరామ్ పెద్ద బావ, మానస్ చిన్న బావ, జెస్సీ బుల్లి బావ అంటూ వివరణ ఇచ్చాడు రవి. దాంతో ప్రియాంక తెగ మెలికలు తిరిగిపోయింది.
బిగ్ బాస్ ‘అభయ హస్తం’!
51వ రోజు మధ్యాహ్నం తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ను మొదలు పెట్టాడు. దానికి ‘అభయహస్తం’ అనే పేరు పెట్టాడు. ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాలోకి పంపించేసి, బిగ్ బాస్ హౌస్ కు లాక్ డౌన్ ప్రకటించాడు. ఆ తర్వాత జరిగే పోటీలలో విజేతలు మాత్రమే హౌస్ లోకి వెళ్ళే ఛాన్స్ కల్పించాడు. తొలి పోటీలో పాల్గొనే ఛాన్స్ ను అంతవరకూ కెప్టెన్ గా ఛాన్స్ దక్కించుకోని వారికి కల్పిద్దామని కెప్టెన్ సన్నీ చెప్పడంతో షణ్ముఖ్ – లోబోకు అవకాశం దక్కింది. వారిద్దరికీ బిగ్ బాస్ ‘మట్టిలో ముత్యాలు’ అనే టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో మట్టి, పేడ మిశ్రమాన్ని ఓ బాత్ టబ్ లో వేసి, అందులో కొన్ని ముత్యాలనూ వేశారు. వాటిని ఎవరు ఎక్కువగా తీస్తే వారు విజేతలు అయినట్టు! ఈ గేమ్ లో 101 ముత్యాలను ఏరి షణ్ణు విజేతగా నిలిచాడు. లోబోకు కేవలం 74 ముత్యాలే దక్కాయి. దాంతో షణ్ణుకు కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ తో పాటు హౌస్ లోకి ఎంట్రీ లభించింది.
ఇక రెండో గేమ్ లో పాల్గొనే ఛాన్స్ ను తనకు లేఖను ఇచ్చి త్యాగం చేసిన సిరికి ఇస్తూ విశ్వ కెప్టెన్సీ టాస్క్ పోటీ నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దాంతో రెండో ఆటలో రవి, సిరి పోటీ పడ్డాడు. ‘గాలం మార్చే మీ కాలం’ అనే ఈ టాస్క్ లో స్విమ్మింగ్ పూల్ లోని బాటిల్స్ ను గాలం సాయంతో బయటకు తీసే పని ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో సిరి 15 బాటిల్స్ పైకి తీసి విజేతగా నిలువగా, రవి 12 బాటిల్స్ తీశాడు.
మూడో ఆటలో ముందు రోజు లెటర్స్ ను త్యాగం చేసిన వారికి ఇద్దామని సన్నీ చెప్పడంతో దానికి కూడా మిగిలిన హౌస్ మేట్స్ అంగీకరించారు. దాంతో తనకొచ్చిన లెటర్ ను జెస్సీ కోసం క్రష్ చేసిన శ్రీరామ్, అలానే తన కొచ్చిన లేఖను యానీ కోసం త్యాగం చేసిన మానస్ కు మధ్య పోటీ జరిగింది. దీనికి బిగ్ బాస్ పెట్టిన పేరు ‘తాడుల తకథిమి’. ఈ గేమ్ లో రోప్స్ ను నాన్ స్టాప్ గా స్వింగ్ చేయించాల్సి ఉంటుంది. పోటాపోటీగా జరిగిన ఈ టాస్క్ లో మానస్ అలిసి పోయి చివరి క్షణంలో గేమ్ నుండి డ్రాప్ అయ్యాడు. దాంతో కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ తో పాటు హౌస్ లోకి శ్రీరామ్ కు ఎంట్రీ లభించింది.
ఆ రకంగా 51వ రోజు జరిగిన మూడు టాస్క్ లలో షణ్ణు, సిరి, శ్రీరామ్ విజేతలుగా నిలిచి, బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశం సంపాదించారు. ఇక హౌస్ లో సిరి, షణ్ణు తమకు ఇష్టమైన వంటకాలు చేసుకుని, హాయిగా భోజనం చేశారు. విశేషం ఏమంటే… ఈ వారం నామినేషన్స్ లో ఖచ్చితంగా మగవాళ్ళే ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నామినేషన్స్ లో ఐదుగురు అబ్బాయిలు ఉండగా, అమ్మాయి కేవలం సిరి మాత్రమే! ఆమెకు ఓటర్ల నుండి మంచి సపోర్ట్ లభిస్తుండటంతో ఈసారి లోబో ఎలిమినేట్ కావచ్చనే పుకార్లు షికారు చేస్తున్నారు.