NTV Telugu Site icon

బిగ్ బాస్ హౌస్ లో బొమ్మల ఫ్యాక్టరీ!

Bigg-Boss-5

Bigg-Boss-5

బిగ్ బాస్ సీజన్ 5లో 37వ రోజు సాదాసీదాగా సాగిపోయింది. ముందు రోజుకు జరిగిన నామినేషన్స్ గురించి ఆ రాత్రి, అలానే ఆ మర్నాడు కొంత చర్చ జరిగా, గతంలో మాదిరిని ఎవరు, ఎవరిని, ఎందుకు నామినేట్‌ చేశారనేదే ప్రధానాంశంగా ఉంది. యానీ మాస్టర్ ను ఎందుకు నామినేట్‌ చేయలేదని షణ్ముఖ్ ను జెస్సీ, సిరి ప్రశ్నించారు. అది తన స్ట్రేటజీ అని అతను బదులివ్వడం విశేషం. అదే విధంగా యానీని ఎందుకు నామినేట్ చేశావని విశ్వను శ్రీరామ్ సైతం అడిగాడు. ఆమె ప్రవర్తన నచ్చక ఆ నిర్ణయం తీసుకున్నానని విశ్వ సమాధానం చెప్పాడు. ఇక శ్వేత తాను కాజల్‌ ను, సిరిని నామినేట్‌ చేయడాన్ని మర్నాడు ఉదయం కూడా సమర్థించుకుంది. ఆవేశంగా మాట్లాడుతూ కాస్తంత కంట్రోల్ తప్పింది. హమీదా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో శ్రీరామ్ తన నైట్ వాకింగ్ పార్టనర్ గా శ్వేతను ఎంచుకున్నాడు. ఇద్దరూ కలిసి రాత్రి చాలాసేపు గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేశారు. ఆ సందర్భంగా హౌస్ మేట్స్ లో కొందరు హమీదా గురించి పాస్ చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని, వాళ్ళు అలా చేసి ఉండకూడదని శ్రీరామ్ కు శ్వేత చెప్పింది. విశ్వను నామినేట్ చేసిన ప్రియాంక ముందు అనుకున్నట్టుగానే అతనికి సారీ చెప్పి, ఇక మీదట అంతలా ఆవేశపడనని హామీ ఇచ్చింది.

విశేషం ఏమంటే… బిగ్ బాస్ హౌస్ లో త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్‌, జెస్సీ, సిరి ముగ్గురూ మొట్టమొదటిసారి నామినేషన్స్ లో ఉన్నారు. ఈ విషయాన్ని వారే సరదాగా నవ్వుకుంటూ చెప్పుకున్నారు. మూడు నాలుగు వారాల పాటు నామినేషన్ కు గురి కానీ షణ్ణు గత రెండు వారాలుగా నామినేట్ అవుతూ వచ్చాడు. అలానే సిరి గత వారం తప్పించుకుంది కానీ ఈవారం నామినేట్ అయ్యింది.

సిరిని ‘డ్రామా క్వీన్’ అని ఎద్దేవా చేసిన యానీ
బిగ్ బాస్ 37వ రోజు ఇంటి సభ్యులకు బొమ్మలను తయారు చేసే టాస్క్ అప్పగించాడు. ముగ్గురు సభ్యులు ఒక టీమ్ గా నాలుగు గ్రూపులు చేశాడు. బ్లూ టీమ్ లో మానస్, సన్నీ, యాని మాస్టర్; ఎల్లో టీమ్ లో జెస్సీ, ప్రియాంక, షణ్ణు; రెడ్ టీమ్ లో విశ్వ, శ్రీరామ్, ప్రియ; గ్రీన్ టీమ్ లో రవి, లోబో, శ్వేత ఉన్నారు. కాజల్‌, సిరిని సంచాలకులుగా నియమించాడు. కెప్టెన్సీకి సంబంధించిన ఈ టాస్క్ కు ‘బీబీలో బొమ్మల ఫ్యాక్టరీ’ అనే పేరు పెట్టారు. బిగ్ బాస్ బొమ్మలకు సంబంధించిన మెటీరియల్స్ ను పంపినప్పుడు వాటిని అందుకుని, ఎవరు ఎక్కువ బొమ్మలను కరెక్ట్ గా చేస్తే వారు కెప్టెన్సీ టాస్క్ కు ఎంపిక అవుతారు.

ఇందులో కాజల్‌ కి చెందిన బ్లూ అండ్ ఎల్లో టీమ్స్ చేసే బొమ్మల క్వాలిటీని సిరి; సిరికి చెందిన రెడ్ అండ్ గ్రీన్ టీమ్స్ చేసే బొమ్మల నాణ్యతను కాజల్ పరీక్షించి, ఎన్ని బొమ్మలు పర్ ఫెక్ట్ గా ఉన్నాయో చెప్పాల్సి ఉంటుంది. అయితే అందరూ ఊహించినట్టుగానే ఇక్కడ కూడా మెటీరియల్ ను ఒకరి నుండి ఒకరు లాక్కోవడం దగ్గర నుండి గేమ్ మొదలైంది. ఆ తర్వాత బొమ్మలను ఇతరుల కంట పడకుండా దాయడం కూడా చేశారు. ఒకరి బొమ్మలను ఒకరు గుంజుకోవడంతో మొదలై, వాటిని చించుకునే వరకూ టాస్క్ సాగింది. మరీ ముఖ్యంగా సంచాలకురాలు సిరికి యానీ మాస్టర్ సూచన చేయడంతో తనకు ఎవరూ, ఏమీ చెప్పక్కర్లేదని సిరి ఎదురు బదులిచ్చింది. దాంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సిరిని ‘డ్రామా క్వీన్’ అంటూ యాని మాస్టర్ సంభోదించడంతో ఈ వివాదం మరో స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా వారిని ఇంటి సభ్యులు వారించే ప్రయత్నం చేశారు. సిరిని పక్కకు తీసుకెళ్ళి షణ్ముఖ్ హితబోధ చేశాడు. శ్రీరామ్ తనకు మెచ్యూరిటీ లేదని చెప్పినప్పుడు తాను రియాక్ట్ కాని విషయాన్ని గుర్తు చేస్తూ, మౌనం అంత ఉత్తమం ఇంకోటి ఉండదని, అనవసరంగా గొడవ చేయొద్దని చెప్పాడు. ఇక కాజల్ మీద కూడా యానీ మాస్టర్ ఆవేశం చూపించింది. ఆమె కూతురు ఈ షో చూస్తుంటుంది కాబట్టి తాను ఎక్కువ బయటపడటం లేదని, తానో పామునని కాజల్ మొదటివారమే తనతో చెప్పిందని యానీ మాస్టర్ తెలిపింది. మొత్తం మీద 37వ రోజులు శ్వేత, యాని మాస్టర్, సిరి ఆవేశకావేశాలతో గడిచిపోయింది.