NTV Telugu Site icon

బిగ్ బాస్ హౌస్ లో దసరా సరదాలు!

Bigg-Boss-5

బిగ్ బాస్ సీజన్ 5లో ఆదివారం దసరా సందర్భంగా నవరాత్రి సంబరాలకు నాగార్జున శ్రీకారం చుట్టారు. అందుకోసం రెగ్యులర్ టైమ్ కు భిన్నంగా ఆదివారం ఆరు గంటలకే బిగ్ బాస్ షోను ప్రారంభించారు. హౌస్ లోని సభ్యులందరినీ రెండు టీమ్స్ గా చేసి, ఏకంగా తొమ్మిది పోటీలు పెట్టి, తొమ్మిది అవార్డులను విన్నింగ్ టీమ్ కు ఇచ్చాడు. నవరాత్రి స్పెషల్ కాబట్టి, దానికి పాలపిట్ట అవార్డు అని పేరు పెట్టారు. ఇందులో రవి టీమ్ తరఫున ప్రియాంక, సన్నీ, షణ్ముఖ్, యాని, లోబో, హమీదా, శ్వేత పాల్గొనగా, ప్రియా టీమ్ తరఫున విశ్వ, శ్రీరామ్, జస్వంత్‌, కాజల్‌, మానస్, సిరి పాల్గొన్నారు. బుల్ ఫైట్ లో సన్నీ, శ్వేత రవి తరఫున, విశ్వ, సిరి ప్రియా టీమ్ తరఫున బరిలోకి దిగారు. ఇందులో సన్నీ, సిరి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గెలిచిన వారి టీమ్ లోని ఒకరిని ఎంపిక చేసి వారి ఫ్యామిలీకి చెందిన వీడియోను ప్లే చేస్తారు. అలా రవి తరఫున లోబో, ప్రియా తరఫున జెస్సీ ఫ్యామిలీ వీడియోలను ప్లే చేశారు. అయితే టైమ్ ను బట్టి ప్రియా టీమ్ ను విన్నర్ గా ఎంపిక అవార్డును అందచేశారు. ఈ గేమ్ అవ్వగానే నామినేషన్స్ నుండి నాగార్జున మానస్, జెస్సీలను సేవ్ చేశారు. ఆ తర్వాత ‘గుడ్ ఓవర్ ఈవిల్’ స్కిట్ లో రవి టీమ్ ను విజేతగా ఎంపిక చేశారు. దాంతో యాని మాస్టర్ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోను ప్లే చేశారు. దీని తర్వాత నాగార్జున మూడో గేమ్ గా ఆరు బాక్సులను అందించారు. అందులో రవి టీమ్ కు చెందిన ప్రియాంక, హమీదా కు స్వీట్స్ రావడంతో ఆ టీమ్ విజేతగా నిలిచింది. దాంతో రవి ఫ్యామిలీ వీడియో కాల్ ను ప్లే చేశారు. ఆ తర్వాత నాగార్జున పెట్టిన ఐక్యూ టెస్ట్ లో ప్రియా టీమ్ గెలిచింది. ఆ సందర్భంగా విశ్వ ఫ్యామిలీ వీడియో బైట్ ప్లే చేశారు. ఆ తర్వాత నాగార్జున ప్రియా అండ్ రవిని సేవ్ చేశారు. ఇక విజయదశమి సందర్భంగా సంధ్యారాజ్ టీమ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. సంధ్యారాజ్ నటించిన ‘నాట్యం’ సినిమా ఈ నెల 22న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమెకు బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ అంతా శుభాకాంక్షలు తెలిపారు.

కుండమీద కుండ పెట్టించిన నాగ్!
ఇక రెండు గ్రూప్స్ నుండి ఇద్దరిద్దరు చొప్పున ఎంపిక చేసి కుండల దొంతర పెట్టి ముందుకు సాగమని నాగ్ ఆర్డర్ వేశాడు. ఈ టాక్స్ లో కాజల్ నెగ్గింది. దాంతో ప్రియా టీమ్ వారికి ఫ్యామిలీ వీడియోను చూసే ఆస్కారం మరోసారి దక్కింది. ఈసారి ఆ ఛాన్స్ ప్రియానే తీసుకుంది. దీని తర్వాత మంగ్లీ తాను సినిమాలలో పాడిన పాటలతో వీక్షకులను ఆకట్టుకుంది. అదే సమయంలో బిగ్ బాస్ లోని సభ్యులతో నాగ్ బతుకమ్మ ఆడించారు. అందులో విజేతగా ప్రియా టీమ్ నిలిచింది. ఈసారి కాజల్ ఫ్యామిలీ వీడియో బైట్ ను ప్లే చేశారు. దీని తర్వాత హైపర్ ఆది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా వేదికపైకి వచ్చి, దాదాపు ఇరవై నిమిషాలు నవ్వుల పువ్వులు పూయించాడు. తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేసి అందరికీ గొప్ప రిలీఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాగార్జున నామినేషన్స్ నుండి లోబోను సేవ్ చేశారు. ఆపైన ఖలేజా అనే పేరుతో ‘మునిగినోళ్ళే మొనగాళ్ళు’ ఆట ఆడించారు నాగార్జున. రెండు టీమ్స్ నుండి ఒక్కొక్కరు చొప్పన స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ఎక్కువ సేపు ఎవరు మునిగి ఉండగలరనేది గేమ్. ఇందులో ప్రియా టీమ్ నుండి విశ్వ, రవీ టీమ్ నుండి హమీదా పాల్గొనగా విశ్వ విజేతగా నిలిచాడు. దాంతో సిరి ఫ్యామిలీ వీడియోను ప్లే చేశారు.

ఆటపాటతో ఆకట్టుకున్న మీనాక్షి దీక్షిత్!
పలు చిత్రాలలో నాయికగా నటించడంతో పాటు ఐటమ్ గర్ల్ గానూ పేరు తెచ్చుకున్న మీనాక్షి దీక్షిత్ ఈ వేదికపై నర్తించింది. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులకు నాగ్ పెట్టిన మానిక్వీన్ అలంకరణ పోటీకి జడ్జ్ గా వ్యవహరించింది. ఇందులో రవి టీమ్ మానిక్వీన్ ను అందంగా అలకరించినా, వారు తయారు చేసిన మానిక్వీన్ మధ్యలో పడిపోవడంతో తిరిగి నాగార్జున ప్రియా టీమ్ నే విజేతలుగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ దసరా కానుకగా ఈ నెల 15న విడుదల కాబోతున్న సందర్భంగా ఆ ఇద్దరూ బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. సినిమా విశేషాలను ఇంటి సభ్యులకు తెలియచెప్పారు. ఇదే సమయంలో హీరోయిన్ పూజా హెగ్డేను ఇంటిలోని ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇంప్రస్ చేయాల్సిందిగా నాగ్ కోరాడు. అందులో ఫైనల్స్ లో షణ్ముఖ్, మానస్ నిలువగా, మానస్ నే విజేతగా నాగ్ ప్రకటించాడు.

ఎలినిమినేషన్ కు ముందే ప్రోమో!
చిత్రం ఏమంటే… అప్పటికీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారే విషయంలో ఓ క్లారిటీ రాలేదు. కానీ పొరపాటున షోలో ఆ మర్నాడు ప్రదర్శించే ఎలిమినేటర్స్ ఇంటర్వ్యూ ప్రోమోను ప్లే చేశారు. అందులో హమీదాను అరియానా ఇంటర్వ్యూ చేస్తూ ఉండటంతో ఎలిమినేట్ అవ్వబోతోంది హమీదా అనేది ముందే లీక్ చేసినట్టు అయిపోయింది. ఈ మానవతప్పిదం కారణంగా బిగ్ బాస్ టీమ్ లోని డొల్లతనం బయటపడింది. ఇక చివరగా విశ్వ, హమీదా ఎలిమినేషన్స్ లో హమీదా ఓటమి పాలైంది. దాంతో ఆమెకు ఇంటి సభ్యులంతా కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక నాగ్ తో పాటు వేదికపైకి వెళ్ళిన హమీదా చాలా వరకూ నిబ్బరంగానే ఉంది. కానీ శ్రీరామ్ ను హమీదా కోసం ఓ పాట పాడమని నాగ్ కోరగానే, అతను ‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాట పాడాడు. దాంతో అప్పటి వరకూ కన్నీటిని అదిమిపెట్టి ఉంచిన హమీదా బుగ్గల పై నుండీ నీరు జలజలా రాలిపోయింది. హౌస్ లో తనను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి హమీదా అని, అందుకే ఆమెతో కనెక్ట్ అయ్యానని, ఆమె గురించి తాను మాట్లాడిన ప్రతి మాట మనసులోంచి వచ్చిందని శ్రీరామ్ చెప్పడం విశేషం. హౌస్ లోని మిగిలిన వారిపై పాజిటివ్ గా స్పందించిన హమీదా కాజల్ ను మాత్రం ఫేక్ అంటూ తీవ్రంగా విమర్శించింది. ఇక హమీదా తోడులేని శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటాడో చూడాలి.