బిగ్ బాస్ సీజన్ 5 52వ రోజు కెప్టెన్సీ పోటీదారుల తుది ఎంపిక జరిగిపోయింది. ముందు రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి కెప్టెన్సీ పోటీకి షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ అర్హత సంపాదించారు. ఇక ఆ మర్నాడు జరిగిన టాస్క్ లలో యానీ, సన్నీ మానస్ తమ సత్తాను చాటారు. రెండో రోజు ‘అభయ హస్తం’ నాలుగో రౌండ్ లో ‘రంగు పడుద్ది’ అనే గేమ్ ను బిగ్ బాస్ నిర్వహించాడు. ఇందులో ప్రియాంక – యానీ మాస్టర్ తలపడ్డారు. గార్డెన్ ఏరియాలో ఓ వైట్ బోర్డ్ ను పెట్టి, అందులో ఎవరి దగ్గర ఉన్న రంగును ఎక్కువగా బోర్డ్ మీద వేస్తే, వారు విజేతలు అని బిగ్ బాస్ చెప్పాడు. యానీ రెడ్ కలర్, ప్రియాంక బ్లూ కలర్ వేశారు. ఇద్దరి రంగులూ ఒక దానితో ఒకటి మిక్స్ అయినా… రెడ్ కలర్ డామినేటింగ్ గా ఉండటంతో యానీ మాస్టర్ ను సంచాలకుడు సన్నీ విజేతగా ప్రకటించాడు. ఆ తర్వాత ‘కారులో హుషారు’గా గేమ్ లో సన్నీ – కాజల్ తలపడ్డారు. టాయ్ కారులో ఒక చివరి నుండి మరో చివరకు వెళ్ళి, అక్కడున్న పూలకుండీని ఇటు చివరకు తీసుకురావడం గేమ్. ఇందులో సన్నీ నాలుగు పూల కుండీలను ఇవతలకు చేర్చగా, కాజల్ ఒక కుండీ మాత్రమే తీసుకొచ్చింది. దాంతో సన్నీ విజేతగా నిలిచాడు.
బంతిలో ఉంది భాగ్యం!
షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ కాకుండా కెప్టెన్సీ టాస్క్ లో అర్హత సంపాదించ లేకపోయిన మిగిలిన 7గురు ఇంటి సభ్యులకు లాస్ట్ ఛాన్స్ గా బిగ్ బాస్ ‘బంతిలో ఉంది భాగ్యం’ అనే గేమ్ నిర్వహించాడు. ఓ సర్కిల్ మధ్యలో బాల్ ను పెట్టి, ఎవరు దానిని ముందు చేజిక్కించుకుంటారో వారు తమతో ఉన్న వేరొకరిని పోటీ నుండి ఎలిమినేట్ చేయొచ్చు. ఈ టాస్క్ లో మానస్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రతిసారీ అతనే బాల్ ను చేజిక్కించుకుని వరుసగా విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, ప్రియాంక లను పోటీ నుండి ఎలిమినేట్ చేసి విజేతగా నిలిచాడు. దాంతో ‘అభయ హస్తం’ టాస్క్ పూర్తయినట్టు బిగ్ బాస్ ప్రకటించి, లాక్ డౌన్ ఎత్తివేసి, హౌస్ లోకి అందరికీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ రకంగా ఈవారం కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా షణ్ణు, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ ఎంపికయ్యారు. మరి రేపు జరుగబోయే గేమ్స్ లో ఎవరిపై ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారో చూడాలి.