NTV Telugu Site icon

నామినేషన్స్ నుండి తప్పించుకున్న ఆ ముగ్గురు!

తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ నాలుగు వారాల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సార్లు నామినేషన్ జోన్ లోకి వచ్చారు. వ్యూవర్స్ వేసిన ఓటింగ్ లేదా బిగ్ బాస్ వ్యూహంలో భాగంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. కానీ ముగ్గురు మాత్రం ఇంతవరకూ అసలు ఒక్కసారి కూడా నామినేట్ కాకపోవడం విశేషం.

బుల్లితెర నటుడు విశ్వ అందులో ఒకరు. కండలు పెంచిన దేహంతో కాస్తంత గొంతు పెంచి మాట్లాడే విశ్వలో మరో కోణం కూడా ఉంది. ఒక్కోసారి అందరి మీద నోరుచేసుకునే ఈ వ్యక్తి… ఠక్కున కన్నీళ్ళు కూడా పెట్టేసుకుంటాడు. ఫ్యామిలీతో బాండింగ్ బాగా ఉన్న విశ్వ… ఇంతవరకూ సోలోగానే తన గేమ్ ఆడుతూ వస్తున్నాడు. అతను ఈ నాలుగు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్స్ లో లేడు. అలానే మరో వ్యక్తి షణ్ముఖ్. డాన్స్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న షణ్ణు… వెబ్ సీరిస్ లోనూ నటించి, అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే… షణ్ణుకు యూత్ మంచి క్రేజ్ ఉంది. అయితే… అతను నామినేషన్స్ లో ఉంటే.. ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇంతవరకూ షణ్ణు నామినేషన్స్ జాబితాలో చేరలేదు. ఇక మూడో వ్యక్తి శ్వేతా వర్మ. వెండితెర నటిగా ఓ మాదిరి గుర్తింపును పొందిన శ్వేతవర్మకు ఇప్పుడిప్పుడే పలు అవకాశాలు లభిస్తున్నాయి. ఏ విషయంలో అయినా చాలా క్లారిటీతో ఉండే శ్వేత కూడా నామినేషన్స్ రొంపిలో ఇంతవరకూ పడలేదు. మరి ఈ ముగ్గురు ఎంతకాలం ఆ ట్రాప్ లో పడకుండా సేఫ్ జోన్ లో ఉంటారో చూడాలి.