బిగ్ బాస్ సీజన్ 5లో అత్యంత క్లిష్టమైన టాస్క్ ప్రస్తుతం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా బిగ్ బాస్ విడగొట్టాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే ఈ రెండు టీమ్స్ లోనూ ప్రత్యర్థి వర్గంలోని ఒకరిని ఎంపిక చేసుకుని, వాళ్ళు గేమ్ నుండి క్విట్ అవుతున్నామని చెప్పేలా ఇవతలి వర్గం టార్చర్ పెట్టాలి. ఈ టాస్క్ కారణంగా ఇంటి సభ్యులు కొందరి చేతులకు గాయాలు అయ్యాయి, మరి కొందరికి కనిపించని దెబ్బలు తగిలాయి. వెర్టిగోతో బాధపడుతున్న జెస్సీ అయితే ఒకసారి పడిపోయాడు. బాధాకరం ఏమంటే, ఎవరికి ఏమేమి ఇష్టం ఉండవో అవే టాస్క్ లో భాగంగా తినాల్సి వచ్చింది. కోడిగుడ్డు సొనను తాగించడం, జ్యూస్ లో రకరకాల పదార్థాలను కలిపి ఇవ్వడం, ముఖంపై రంగు నీళ్ళు పోయడం వంటి వికృత చర్యలు చాలానే జరిగాయి. చూసే వారికే పరమ జుగుప్సగా అనిపించిన ఈ టాస్క్ ను కెప్టెన్సీ కోసం సభ్యులు పంటి బిగువున భరించారు. చివరకు రెండో రోజు ఆట ముగిసే సమయానికి సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ కు చెరో రెండు పాయింట్స్ దక్కాయి.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్స్ లో ప్రియాంక, యాని మాస్టర్ పడిన కష్టాలు మరొకరికి రాకూడదన్నట్టుగా అనిపించింది. వీరిద్దరూ తమకు ఇష్టం లేకపోయినా, ఎదుటి వాళ్ళు ఇచ్చిన ప్రతి ఐటమ్ ను ముక్కుమూసుకుని తాగేశారు. జుత్తు కత్తిరించుకోవాలని పింకీకి సిరి చెప్పినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ సరే అంది. అసలు సమాధానం ఏమి ఇస్తుందో చూద్దామని అలా అడిగానని సిరి చెప్పడం కొసమెరుపు.
ఇంత దారుణమైన టాస్క్ లో తాను పాల్గొనలేనని మొదట చెప్పిన యానిని ప్రత్యర్థి వర్గం ఎంపిక చేసుకోవడంతో ఆమె కూడా తగ్గేదే లే అన్నట్టుగా టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన లీక్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూపర్ విలన్స్ కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించారని, వారిలో ఒకరైన యాని మాస్టర్ ఈ వారం కెప్టెన్ గా ఎంపికయ్యారని తెలుస్తోంది. అదే నిజమైతే మాత్రం యాని మాస్టర్ చిరకాల కోరిక తీరినట్టే. గ్రూప్ గా ఆడితేనే కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించగలరని, తనలా ఇండివిడ్యువల్ గా ఆడేవారికి కెప్టెన్సీ దక్కదని యానీ చాలా సందర్భాలలో వాపోయింది. అందులో వాస్తవం లేదని తేలింది. మొత్తం మీద ఈ వారం ఆమెకే కెప్టెన్సీ దక్కడం అందరికీ ఆనందాన్ని కలిగించే అంశమే!