రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మంచికి, చెడుకు మధ్య తారతమ్యాన్ని.. చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఒంటరిగా అనుకున్నది సాధించలేని సమయంలో ఇతరుల సహాయం మనకు ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా రామాయణం భార్యాభర్తల మధ్య బాంధవ్యం గురించి వర్ణిస్తుంది. ప్రస్తుతం సమాజంలో ప్రియుడి కోసం భర్తను భార్యలు హత్య చేయడం, ప్రేయసి మోజులో పడి భార్యను హతమార్చడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల తెలంగాణలో ప్రియుడి కోసం ఓ భార్య ముగ్గురు పిల్లల్ని మట్టుబెట్టింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా లేక పోవడం, ఇంట్లో మంచి మాటలు చెప్పే పెద్దలు లేకపోవడం, భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే స్వభావం లేకపోవడం ప్రధాన కారణాలు. వీటితో పాటు ఇగో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే వాళ్లు, ఇప్పటికే పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు.. సీతారాముల బాంధవ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జానకీరాముల బంధం గురించి పూర్తిగా తెలుసుకుందాం..
విల్లువిరిచి సీతను గెలిచిన రాముడు..
గురువులు విశ్వామిత్రునితో మిథిలకు వెళ్లాడు. జనకుని కుమార్తె సీతను వివాహమాడాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. గురువుల అనుజ్ఞతో శివధనుస్సు విరిచి, వారి ఆశీర్వాదంతో సీతను పరిణయమాడాడు శ్రీరాముడు. సీతను తన వెంట అయోధ్యకు తీసుకువెళ్లాడు. గురువుల ఎంపిక ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు. జానకి తన ప్రాణానికి ప్రాణంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అందుకే జానకిని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. కొద్దిరోజులకే… దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం నిర్ణయించాడు.
కష్టాల్లోనూ రాముడి వెంట జానకీ..
రాముడు… తెల్లవారితే రాజు కాబోతున్నాడు. ఇంకేముంది. పట్టాభిషేకమే కదా. సీత మహారాణి అయిపోతుంది. ఇంత ఆనందంగా గడుపుతున్న సమయంలో… పినతల్లి కైకమ్మ అసూయకు రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. వెళ్లవలసింది తను మాత్రమే కనుక, సీతను తనతో పాటు సీత కూడా కష్టాలు పడకూడదనుకున్నాడు. అందుకే తాను మాత్రమే అరణ్యవాసానికి బయలుదేరాడు. ఇంతలో సీత వచ్చి, ‘రామా! మా అమ్మ నాకు కొన్ని నీతులు బోధించింది. భర్త సుఖాలలోనే కాదు, కష్టాలలోనూ పాలు పంచుకోవాలని చెప్పింది. అందువల్ల నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను’ అంది.
అరణ్యమంటే ఆశామాషీ కాదు.: రామయ్య
“సీతా! అరణ్యమంటే.. చెలికత్తెలు వింజామరలు వీచుతుంటే సుఖంగాపట్టుపరుపుల మీద నిద్రించడం, బంగారుపళ్లెంలో భోజనం చేయడం, దాసదాసీ జనం సేవ చేస్తుంటే జీవనం గడపడం అనుకోకు. అరణ్యమంటే – పులులు, సింహాలు, పాములు… వంటి ఎన్నో విషప్రాణులు ఉంటాయి. వాటి బారి నుంచి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కటిక నేల మీద పరుండాలి. సాత్వికమైన ఆహారం తినాలి. అన్నీ కష్టాలే. అందువల్ల నా అరణ్యవాసం పూర్తయ్యేవరకు నువ్వు నీ తండ్రి దగ్గర ఉండు…” అని రాముడు చెప్పాడు.
సీత మాటలకు ఆనందించిన రామయ్య..
రాముడి మాటలకు సీతకు కోపం వచ్చింది. ‘మా నాన్న ఎంత తెలివితక్కువవాడయ్యా, ఆడ రూపంలో ఉన్న పురుషుడికిచ్చి నన్ను వివాహం చేశారు’ అని కొంచెం పరుషంగాపలికింది. సీత తన కష్టాలలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు రాముడు. ఇన్నాళ్లూ రాజభోగాలు అనుభవించిన సీత ఈ నాడు ఇన్ని కష్టాలకు ఓర్చుకోగలదో లేదో అర్థం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఆమె మాటలకు కోపం రాకపోగా ఎంతో ఆనందం కలిగింది రాముడికి.
అడవిలో కష్టాలు..
ఆమె పలికిన ఆ మాటలలో సీతకు రాముడిపై ఉన్న అనురాగం ప్రతిబింబించింది. అందుకే రాముడు సీతను తన వెంట అరణ్యాలకు తీసుకువెళ్లాడు. అంతటి అనురాగం ఉన్న సీత వెంట ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చనుకున్నాడు. అందుకు రాముడు అదర్శం అయ్యాడు. అరణ్యాలలో సీత తనతో ఎన్నో ఇబ్బందులు అనుభవించింది. నేలపై నిరాడంబరంగా శయనించింది. అక్కడ దొరికే కందమూలాలు మాత్రమే స్వీకరించింది. ఆమెకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సీతను రాముడు.
రావణుడిని సంహరించి సీతను దక్కించుకున్న రామయ్య..
ఎన్నడూ ఏ కోరికా కోరని సీత, బంగారులేడి కావాలని తన మనోరథాన్ని వ్యక్తపరిచింది. సీత కోరిక కోరినందుకు రాముడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఎంతో సామాన్యంగా జీవించే తన సీత ఇన్నాళ్లకు ఒక్క కోరికైనా కోరిందని సంబరపడ్డాడు. అంతే వెంటనే ఆ లేడి కోసం బయలుదేరాడు. ఇంతోనే జరగకూడనిది జరిగిపోయింది. పది తలల రావణుడు సీతను అపహరించుకుపోయాడు. ఎంతో కష్టపడి యుద్ధం చేసిన రాముడు చివరికి రావణుడిని సంహరిచి సీతను దక్కించుకున్నాడు రాముడు. ఈ ఇద్దరు దంపతులు తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరిని ఒకరు విడవలేదు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు.
అందరికీ “శ్రీరామ నవమి శుభాకాంక్షలు”