Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి శోభ.. వేములవాడ నుంచి శ్రీశైలం వరకు భక్తుల సందడి

Karthika Pournami

Karthika Pournami

Karthika Pournami 2026: కార్తీక మాసం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, వేయిస్తంభాల గుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. భక్తుల తాకిడికి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక, గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను నదుల్లో వదులుతున్నారు. తులసి, ఉసిరి చెట్ల వద్ద మహిళలు 365 వత్తులతో దీపారాధనలు నిర్వహిస్తున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతుండటంతో పుణ్యక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.

కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల సందడి
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నదిలో వదిలారు. అనంతరం సుందరేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో క్షేత్రం మార్మోగింది. ఈ సందర్భంగా భక్తులు సాలిగ్రామ దానం, దీపదానం, స్వయంపాక దానాలు చేశారు. గోదావరి స్నానఘట్టాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, ఫైర్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

బాపట్ల సూర్యలంక తీరానికి పోటెత్తిన భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే సముద్ర స్నానాలు ఆచరించారు. అనంతరం ఇసుకతో సైకత లింగాన్ని రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

ధర్మపురిలో గోదావరి దీపాల వెలుగులు
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నదికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేకువజామునే నదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను నదిలో వదిలారు. భక్తులు వదిలిన దీపాలతో గోదావరి నది దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలోనూ భక్తుల సందడి నెలకొంది.

కాళేశ్వరంలో ఘనంగా లింగోద్భవ పూజలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకుని శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో లింగోద్భవ పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం, హారతి, మహామంత్ర పుష్పం, చతుర్వేద సేవ నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో భక్తులు స్వామివారికి మారేడు దళాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వైకుంఠ వత్తిని వెలిగించి భక్తిని చాటుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మహేష్, స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి, ధర్మకర్తలు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

వేములవాడ రాజన్న క్షేత్రంలో కార్తీక శోభ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి రాజన్నను దర్శించుకుంటున్నారు. కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేటి సాయంత్రం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించనున్నారు. జ్వాలాతోరణం గుండా స్వామివారు ప్రదక్షిణ చేయనుండటంతో ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కార్తీక పౌర్ణమి వేడుకలతో వేములవాడ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ప్రముఖ శైవక్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కీసరగుట్ట, వేయిస్తంభాల గుడి, పంచారామ క్షేత్రాల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. నదీ తీరాల్లో భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు, నదీ తీరాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా.. భక్తులు శివనామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలుతున్నారు.