NTV Telugu Site icon

Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తజనం..

Kartika Masam

Kartika Masam

Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా ఉత్తమమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో భక్తులు శివకేశవులను పూజిస్తారు. సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేస్తారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఈ నెల 4న తొలి కార్తీక సోమవారం రానుంది. కార్తీక సోమవారాల్లో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. కాగా, కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ బాలా త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

Read also: Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కార్తీకశోభ సంతరించుకుంది. డిసెంబర్ 1 వరకు నెల రోజులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. ఆలయంలో ఆలయ అధికారులు లక్షబిల్వార్చన పూజలకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు సాయంత్రం సాముహిక దీపాలంకరణ ఉంటుంది.

* కార్తీకమాసంలో 4న,11,18,25న ,కార్తీక పౌర్ణమి15 న ఆలయంలో సాముహిక సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు.

*  12 నుండి 15 వరకు పంచరత్నాల్లో భాగంగా గోదావరి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్న అధికారులు తెలిపారు.

*  14న వైకుంఠ చతుర్దశి సందర్భంగా రాత్రి 11గం. స్వామివార్లకు క్షీరాభిషేకం,లింగోధ్బవ పూజ

* 15 న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం సత్యనారయణస్వామి వ్రతం,రాత్రి 7 గం.జ్వాలా తోరణం కార్యక్రమం‌‌ నిర్వహించనున్నారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

మరోవైపు నేటి నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభమైంది. ఈరోజు నుంచి నెల రోజుల పాటు సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో గంగా హారతి నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉగ్ర యోగ లక్ష్మీ నరసింహస్వామి వార్లకి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరగనున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటినుండి నెలరోజుల పాటు కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నాలుగు సోమవారాలు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహా లింగార్చన జరగనుంది. 15న కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణం, రాత్రి మహా పూజ నిర్వహించనున్నారు. కార్తీక మాసం నెలరోజుల పాటు రాజన్న ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం సామూహిక కార్తీక దీపోత్సవం ఉంటుంది.

మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భద్రాచలం పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదలి శివాలయల్లో ప్రత్యేక అభిషేకాలు భక్తులు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Show comments