Site icon NTV Telugu

Rare Hanuman Temple: అక్కడ స్త్రీరూపంలో హనుమంతుడు.. మీకు తెలుసా?

Hanuman1 (1)

Hanuman1 (1)

అంజనీ పుత్రుడు హనుమంతుడు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారం. కష్టాల్లో ఉన్న భక్తకోటికి అభయం ఇచ్చే దేవుడు. ఆంజనేయుడి లీలా వినోదాల గురించి తెలియనవివారుండరు. హనుమాన్ చాలీసా పఠిస్తే చాలు కొండం బలం భక్తుల స్వంతం అవుతుంది. తమలపాకులతో పూజిస్తే చాలు ఆయన ప్రసన్నుడవుతాడు. భక్తులకు ఎల్లప్పుడూ అభయమిచ్చే కలియుగ దైవంగా హనుమంతున్ని హిందువులు పూజిస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హనుమంతుడి ఆలయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే హనుమంతుడు స్త్రీరూపంలో పూజలందుకునే ఆలయం గురించి మీకు తెలుసా?

హనుమంతున్ని స్త్రీ రూపంలో పూజించే దేవాలయం ఛత్తీస్ ఘడ్‌ రాష్ట్రంలో వుంది. ఇలాంటి అరుదైన ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఛత్తీస్ ఘడ్‌ లోని రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లోని ఓ ఆలయంలో హనుమంతున్ని దేవతా రూపంలో పూజిస్తుంటారు. ఇక్కడ పూజలు నిర్వహించే భక్తులకు ఈ ఆలయంపై అపారమైన నమ్మకం ఉంది. ఈ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. ఇక్కడ రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్నట్లు ఉండే ఆంజనేయుని విగ్రహం వుంది.

గిర్జబంద్ ప్రాంతంలో ఈ హనుమాన్ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ఉంది. రతన్ పూర్ రాజు అయిన పృధ్వీ దేవ్ జు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. హనుమంతుడిపై అపారమైన భక్తి గల ఆ రాజు ప్రతి రోజూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించేవాడు. ఓ రోజు ఆయన కుష్టు వ్యాధికి గురై తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు అతడి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని కోరాడట. ఆ హనుమంతుడి ఆదేశాలతో ఈ ఆలయం నిర్మించాడు రాజు.

ఆలయం నిర్మాణదశలో వుండగానే ఆంజనేయుడు రాజు కలలో కనిపించి మహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దానిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని ఆదేశించి అదృశ్యమవుతాడు. మరలా రాజు హనుమంతుడి సూచనల ప్రకారం మరుసటి రోజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ హనుమాన్ విగ్రహం స్త్రీ రూపంలో ఉండడంతో ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత భగవంతుడు తనకిచ్చిన ఆదేశం మేరకే ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయం లోపల ప్రతిష్ట చేస్తాడు. అంతే.. అనారోగ్యం నుంచి కోలుకుంటాడు రాజు. ఈ ఘటన తర్వాత ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.

రతన్ పూర్‌లోని ఈ ఆలయానికి చేరుకోవాలంటే రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ వుంది. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉండే బిలాస్ పూర్ కు బస్సులో వెళ్లవచ్చు. రతన్ పూర్‌ కు సమీప రైల్వే స్టేషన్ బిలాస్ పూర్ జంక్షన్. ఈ స్టేషన్ నుంచి రతన్ పూర్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్ బయట క్యాబ్, బస్సుల ద్వారా ఆలయానికి వెళ్ళవచ్చు. ఇక్కడికి వెళ్లాలంటే శీతాకాలం సరైనది. వేసవి కాలంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. వీలైతే మీరు కూడా స్త్రీమూర్తి రూపంలో వుండే అంజనీపుత్రుడిని దర్శించి తరించండి.

Mining Mafia: గుంటూరులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా

Exit mobile version