Site icon NTV Telugu

Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి నాడు చంద్రుణ్ణి అస్సలు చూడొద్దు! పొరపాటున చూస్తే ఏం చేయాలి?

Ganesh

Ganesh

Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడని చెబుతారు. అందుకే ఏటా ఇదే రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ 27 ఆగష్టున వచ్చింది. అంటే రేపే వినాయక చవితి. వినాయక చవితి వేడుకలు పది రోజుల పాటు జరుపుకుంటారు. అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చతుర్థి తిథి నాడు చంద్రదర్శనం నిషిద్ధం. ఒకవేళ చతుర్థి నాడు చంద్రున్ని చూస్తే ఏం జరుగుతుంది? ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం…

READ MORE: Vizianagaram : ఎడతెరిపిలేని వానలతో రోడ్లు జలమయం..జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ఓ రోజు భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు.. గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు.

అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను పుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది.

READ MORE: Palnadu: ఏఆర్ కానిస్టేబుల్‌ను వేధించిన మహిళ.. సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో!

అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టారు. పొరపాటున చంద్రుణ్ణి చూస్తే కష్టాలు మొదలవుతాయట. నిందల పాలవుతారట. దృక్ పంచాంగ్ ప్రకారం గణేష్ చతుర్థి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే నీలాపనిందల నుంచి బయటపడేందుకు “సింగ్ ప్రసేనాంవధిత్సింఘో జాంబవత హతః’. సుకుమారాక్ మరోదిస్తవ హ్యేష స్యమంతకః” అనే మంత్రాన్ని జపించాలి.

నోట్: పురాణాలు, పలు వెబ్‌సైట్లలో సేకరించిన సమాచారం ప్రకారం ఈ వార్తను ప్రచురించాం. పైన ఇచ్చిన సమాచారం మీ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది.

 

 

Exit mobile version