Site icon NTV Telugu

Yamaha Recalls: అలర్ట్.. మీతో ఈ యమహా స్కూటీలు ఉన్నాయా? వెంటనే షోరూంకి తీసుకెళ్లండి!

Yamaha

Yamaha

Yamaha Recalls Over 3 Lakh 125cc Hybrid Scooters in India: యమహా స్కూటర్లు వాడుతున్న వారికి అలర్ట్. యమహా కంపెనీ తమ 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్లపై స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూడు లక్షలకుపైగా స్కూటర్లను తనిఖీ చేయనుంది. యమహా రే జెడ్ ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, ఫాస్సినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మోడళ్లను రీకాల్ ప్రకటించింది. ఈ రెండు స్కూటర్ల డిజైన్ వేరైనా లోపల ఉండే ముఖ్య భాగాలు మాత్రం ఒకటే. 2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన స్కూటర్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి. మొత్తం 3,06,635 స్కూటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని యమహా తెలిపింది.

READ MORE: Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!

రీకాల్‌కు కారణం స్కూటర్ ముందు బ్రేక్ సిస్టమ్. ముందు బ్రేక్ కాలిపర్ సరిగా పనిచేయడం లేదని యమహా గుర్తించింది. ప్రతి స్కూటర్‌లో ఈ సమస్య ఉండకపోవచ్చు. అయినా వినియోగదారుల భద్రతే ముఖ్యమని భావించి, ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకుంది. ఈ రీకాల్‌లో భాగంగా యమహా అధికృత సర్వీస్ సెంటర్లలో స్కూటర్‌ను పూర్తిగా తనిఖీ చేస్తారు. అవసరమైతే.. పాడైన పార్ట్స్‌ను ఉచితంగా మారుస్తారు. వినియోగదారులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్కూటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సర్వీస్ సెంటర్‌కు వెళ్లే ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలని యమహా సూచిస్తోంది. మీ స్కూటర్ ఈ రీకాల్‌లో ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులువు. యమహా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ‘వాలంటరీ రీకాల్ క్యాంపెయిన్’ పేజీకి వెళ్లి మీ స్కూటర్ ఛాసిస్ నంబర్ నమోదు చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అంతేకాదు, దగ్గరలోని యమహా షోరూమ్‌ను సంప్రదించవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ ద్వారా ఆన్‌లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు.

READ MORE: AP High Court: అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా..?

ఇక ఈ రెండు స్కూటర్ల ఫీచర్ల విషయానికి వస్తే, ఇవి 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తాయి. ఈ ఇంజిన్ 8.2 పీఎస్ శక్తి, 10.3 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్ వ్యవస్థతో ఈ స్కూటర్లు సాఫీగా నడుస్తాయి. ఇంజిన్‌కు తోడుగా స్మార్ట్ మోటార్ జనరేటర్ వ్యవస్థ ఉంటుంది. ఇది బ్యాటరీని చార్జ్ చేయడంతో పాటు, అవసరమైనప్పుడు అదనపు శక్తిని అందిస్తుంది. ఇంజిన్ స్టార్ట్ కూడా చాలా నిశ్శబ్దంగా, సులువుగా ఉంటుంది. ముందు భాగంలో 12 అంగుళాల, వెనుక భాగంలో 10 అంగుళాల వీల్స్ ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ స్కూటర్‌కు మంచి కంఫర్ట్ ఇస్తాయి. బ్రేకింగ్ కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఇక ఈ స్కూటర్లలో వై కనెక్ట్ అనే కనెక్టివిటీ ఫీచర్ ఉంది. యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే, రే జెడ్ ఆర్ 125 డిస్క్ వేరియంట్ ధర సుమారు రూ.80,900 నుంచి మొదలవుతుంది. ఫాస్సినో 125 డిస్క్ వేరియంట్ ధర మాత్రం రూ.87,100 నుంచి ప్రారంభమవుతుంది.

Exit mobile version