TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!

Tvs Apache Rtr 125 Lc

Tvs Apache Rtr 125 Lc

TVS Apache RTR 125 LC Unveiled at EICMA 2026: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company మరో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న EICMA 2026 వేదికగా TVS Apache RTR 125 LCను పరిచయం చేసింది. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బైక్‌ను రూపొందించింది. స్పోర్టీ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్, శక్తివంతమైన 125cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు ఎన్నో ఆధునిక ఫీచర్లను ఇందులో అందించారు. ముఖ్యంగా 5-అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫుల్ స్క్రీన్ మ్యాప్ మిర్రరింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఈ బైక్ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.

TVS Apache RTR 125 LC ఇంజిన్

కొత్త TVS Apache RTR 125 LCలో 125cc, 4-వాల్వ్, DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 14.9 PS పవర్, 12 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అలాగే ఇందులో మల్టీప్లేట్ అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ అందించారు. అసిస్ట్ ఫంక్షన్ వల్ల క్లచ్‌ను తక్కువ శ్రమతో ఆపరేట్ చేయవచ్చు. స్లిప్పర్ క్లచ్ కారణంగా గేర్లు డౌన్‌షిఫ్ట్ చేసే సమయంలో మెరుగైన నియంత్రణ లభిస్తుంది. ఈ బైక్‌లో రైడింగ్ మోడ్స్ కూడా అందించారు. అయితే వాటి పేర్లు, సెట్టింగ్స్, యాక్సిలరేషన్, గరిష్ట వేగానికి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

TVS Apache RTR 125 LC డిజైన్

కొత్త Apache RTR 125 LCను ఆకర్షణీయమైన అగ్రెసివ్ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్‌తో రూపొందించారు. ఇందులో షార్ప్ ట్యాంక్ ష్రౌడ్స్, మస్కులర్ బాడీ వర్క్, ఎక్స్‌పోజ్డ్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఉన్నాయి. ఈ బైక్‌ను మెటాలిక్ సిల్వర్ కలర్‌తో పాటు ఫ్లోరోసెంట్ ఎల్లో హైలైట్స్‌తో డిజైన్ చేశారు. అలాయ్ వీల్స్‌పై కూడా కాంట్రాస్టింగ్ ఎల్లో గ్రాఫిక్స్ అందించారు. ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్‌పై పెద్ద RTR గ్రాఫిక్స్, 125 LC బ్యాడ్జింగ్, TVS హార్స్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లైటింగ్ విషయానికి వస్తే ఇందులో DRLతో కూడిన రెక్టాంగులర్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఉంది. వెనుక భాగంలో ట్రై-స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్, LED టర్న్ ఇండికేటర్లు అందించారు. అలాగే చిన్న ట్రాన్స్‌పరెంట్ ఫ్లైస్క్రీన్, హ్యాండ్‌గార్డ్స్, స్ప్లిట్ సీట్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

TVS Apache RTR 125 LC సస్పెన్షన్, బ్రేకింగ్

ఈ బైక్‌లో TVS Synchro Stiff ఛాసిస్‌ను ఉపయోగించారు. ఇందులో ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో పాటు కాస్ట్ స్వింగ్‌ఆర్మ్ అందించారు. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో 41mm KYB అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్, వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 300mm డిస్క్ బ్రేక్‌తో పాటు రేడియల్లీ మౌంటెడ్ ByBre కాలిపర్ అందించారు. వెనుక భాగంలో 240mm డిస్క్ బ్రేక్, ByBre కాలిపర్ ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ నియంత్రణ కోసం డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇందులో 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి.

TVS Apache RTR 125 LC ఫీచర్లు

ఫీచర్ల పరంగా ఈ బైక్‌లో అనేక ఆధునిక టెక్నాలజీలను అందించారు. ఇందులో ప్రధానంగా 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంది. దీనికి మల్టీ-వే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది. ఈ డిస్‌ప్లే ద్వారా ఫుల్ స్క్రీన్ మ్యాప్ మిరరింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. దీంతో రైడర్లు ప్రయాణ సమయంలో బైక్ స్క్రీన్‌పైనే రూట్ వివరాలను చూసుకోవచ్చు. అంతేకాకుండా ఎడమవైపు హ్యాండిల్‌బార్‌పై ఉన్న స్విచ్‌గేర్ ద్వారా డిస్‌ప్లేలోని వివిధ ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు.

భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ప్రస్తుతం TVS Apache RTR 125 LCను యూరోపియన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఆవిష్కరించింది. ముఖ్యంగా A1 లైసెన్స్ కలిగిన రైడర్లు, కొత్తగా బైక్ నడపడం ప్రారంభించే యువతను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను రూపొందించారు. అయితే ఈ బైక్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది? దీని ధర ఎంత? అనే విషయాలపై TVS కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ బైక్‌ను 2027 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే భారత్‌లో లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. అలాగే బైక్ కర్బ్ వెయిట్, సీట్ హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వంటి వివరాలు కూడా వెల్లడించలేదు.