దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. సరికొత్త మోడళ్లను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతోంది. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ఈ సెగ్మెంట్ లో టాప్ ప్లేస్ ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. టాటా నుంచి ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి వాహనాలు ఉండగా… తాజా నెక్సాన్ ఈవీ మాక్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ బైయింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లలో నెక్సాన్ టాప్ ప్లేస్ లో ఉంది.
గతంలో నెక్సాన్ ఈవీలో రేంజ్ తక్కువగా ఉండేది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే కేవలం 300 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తుంది. అయితే టాటా నెక్సాన్ కు పోటీగా ఉన్న ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా వంటి కార్లు 400 కన్నా ఎక్కువ రేంజ్ ను ఇస్తున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని టాటా సరికొత్త నెక్సాన్ ఈవీ మాక్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 437 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. దీని ఎక్స్ షోరూం ప్రైజ్ ప్రస్తుతం రూ. 17.74 లక్షలుగా ఉంది. అయితే వేరియంట్లను బట్టి ధర కూడా మారనుంది. నెక్సాన్ ఈవీ మాక్స్ లో 40.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది. గతంలో ఉన్న నెక్సాన్ లో 30.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ మాత్రమే ఉండేది.
నెక్సాన్ ఈవీ మాక్స్ లో ఫీచర్లను కూడా పెంచింది టాటా. క్రూజ్ కంట్రోల్, ఎయిర్ ఫ్యూరిఫైయర్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హెల్డ్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లను నెక్సాన్ ఈవీ మాక్స్ లో ఇచ్చారు. ఇందులోని మోటర్ 105 కిలోవాట్ పవర్ లో 250 న్యూటన్ మీటర్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీ ప్యాక్, మోటర్ పై టాటా 8 ఏళ్ల గ్యారెంటీని ఇస్తోంది.