NTV Telugu Site icon

Hyundai: గ్రామీణ భారతాన్ని “హ్యుందాయ్” ఎలా ఆకట్టుకుంటోంది..

Hyundai

Hyundai

Hyundai: దేశంలో అత్యుత్తమ అమ్మకాలు నమోదు చేస్తున్న కార్ మేకర్ కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. తన మోడళ్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు చేస్తోంది. దీంతో పాటు రానున్న కాలంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా మంచి అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బలమైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) పోర్ట్‌ఫోలియో కలిగిన హ్యుందాయ్ తన క్రెటా అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇదే కాకుండా వెన్యూ, ఎక్స్‌టర్ ఇలా విస్తృత విక్రయాలను, సర్వీస్ నెట్వర్క్‌లను కలిగి ఉంది.

ముఖ్యంగా గ్రామీణ భారతం హ్యుందాయ్ సత్తా చాటుతోంది. పట్టణ మార్కెట్ కన్నా గ్రామీణ మార్కెట్‌లో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా గ్రామీణ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో హ్యుందాయ్ అమ్మకాలు పట్టణ మార్కెట్‌లో 6 శాతం, గ్రామీణ మార్కెట్‌లో 15 శాతం పెరిగాయి. 2023లో పట్టణ మార్కెట్‌లో 5 శాతం, రూరల్ మార్కెట్‌లో 11 శాతం వృద్ధి నమోదైంది. 2024 మొదటి నాలుగు నెలల్లో(జనవరి-ఏప్రిల్) అర్బన్ గ్రోత్ 1 శాతం ఉంటే, రూరల్ గ్రోత్ 9 శాతం ఉంది.

గ్రామీణ ప్రాంతంలో హ్యుందాయ్ SUV వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ఐసీఈ), ఎలక్ట్రిక్ మోడళ్లు ఎల్లప్పుడూ పట్టణ కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటాయి. అయితే, ప్రస్తుతం వీటికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని ఏళ్లుగా గ్రామీణ అమ్మకాల్లో SUV వాహనాలు స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. 2020లో 37 శాతం, 2021లో 43 శాతం, 2022లో 49 శాతం, 2023లో 56 శాతం, 2024 తొలి నాలుగు నెలల్లో 67 శాతం వాటాను కలిగి ఉంది. రూరల్ అమ్మకాల్లో క్రెటా 26 శాతం, వెన్యూ 23 శాతం, ఎక్స్‌టర్ 16 శాతం ఉన్నాయి.

Read Also: Maharagni : డైరెక్టర్ గా మారిన ప్రొడ్యూసర్.. పాన్ ఇండియన్ ‘మహా రాగ్ని టీజర్’!

వాల్యూ ఫర్ మనీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే హ్యుందాయ్ లక్షణం గ్రామీణ కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటోంది. దీంతో పాటు విస్తృత అమ్మకాలు, సర్వీస్ నెట్వర్క్ కూడా ఇందుకు ఇందుకు దోహదపడుతుంది. హ్యుందాయ్‌కి దేశవ్యాప్తంగా 1,366 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 47% లేదా 643 గ్రామీణ ఔట్‌లెట్‌లుగా వర్గీకరించబడ్డాయి, 429 జిల్లాల పరిధిలో ఉన్నాయి. అంతేకాకుండా, దాదాపు అన్ని గ్రామీణ అవుట్‌లెట్‌లు ఫిజికల్ సర్వీస్ బేలు లేదా 100 మొబైల్ సర్వీస్ వ్యాన్‌ల ద్వారా సర్వీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మెరుగైన రహదారి అవస్థాపన సౌకర్యాలు, అధిక సర్వీస్ సెంటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కొనుగోలు శక్తి కూడా రూరల్ కస్టమర్ల పెరుగుదలకు కారణమవుతోందని హ్యుందాయ్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెబుతున్నారు.

హ్యుందాయ్ గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో 1,15,000 యూనిట్లను విక్రయించింది. ఇయర్ టూ ఇయర్ 11 శాతం వృద్ధిని సాధించింది. మంచి రుతుపవనకాలం, ఆదాయ స్థాయిలను పెంచడం, మెరుగైన మౌళిక సదుపాయాలతో, గ్రామీణ మార్కెట్ల సహకారం మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ రోజు 44 శాతం కొత్తగా వచ్చే కొనుగోలుదారులు రూరల్ ప్రాంతం నుంచే వస్తున్నారని అన్నారు. డిజిటల్ మీడియా రాకతో గ్రామీణ కొనుగోలుదారుల ఆకాంక్షలతో పాటు పట్టణ, గ్రామీణ కొనుగోలుదారుల ప్రవర్తనలో సమానత్వం చూస్తున్నట్లు తెలిపారు.