Mahindra Bolero Camper: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రముఖ కమర్షియల్ వాహనలు బొలెరో క్యాంపర్, బొలెరో పిక్-అప్ లను ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా బొలెరో క్యాంపర్‌కు అడ్వాన్స్‌డ్ iMAXX టెలిమాటిక్స్ సిస్టమ్ ను అందించింది. ఈ కొత్త టెక్నాలజీ ఫ్లీట్ యజమానులు, కమర్షియల్ యూజర్లకు వాహన నిర్వహణను మరింత సులభం చేసేలా దీనిని రూపొందించారు. iMAXX టెలిమాటిక్స్ ద్వారా వాహనానికి సంబంధించిన రియల్‌టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుంది.
దీని వల్ల వాహన లొకేషన్ ట్రాకింగ్, డ్రైవింగ్ ప్యాటర్న్ విశ్లేషణ, ఫ్యూయల్ వినియోగం, వాహన పనితీరు వంటి కీలక అంశాలను ఈ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఫ్లీట్ ఎఫిషియెన్సీ పెరగడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం లభిస్తుంది. డిజైన్ పరంగా కూడా బొలెరో క్యాంపర్‌కు స్వల్ప మార్పులు చేశారు. ఇందులో భాగంగా కొత్త డెకల్స్, బాడీ కలర్ ORVMలు, డోర్ హ్యాండిల్స్‌తో వాహనం మరింత మోడ్రన్ లుక్‌ను సంతరించుకుంది. కేబిన్‌లో వెనుక సీటు ప్రయాణికుల కోసం హెడ్‌రెస్ట్‌లు అందించారు. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఎయిర్ కండిషనర్‌తో పాటు హీటర్‌ను కూడా స్టాండర్డ్‌గా పొందుపరిచారు.
ఇంకా సౌకర్యం కోసం బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో మ్యూజిక్ సిస్టమ్‌ను అమర్చారు. డ్రైవర్ కంఫర్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, రీక్లైనర్ డ్రైవర్ సీటు, హెడ్‌రెస్ట్, వెడల్పైన కో-డ్రైవర్ సీటును అన్ని వేరియంట్లలో అందిస్తున్నారు. సెంట్రల్ లాకింగ్, రియర్ సీట్ బెల్ట్‌లు, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. బండి పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 80Hp పవర్, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 2WD, 4WD ఆప్షన్లలో ఈ వాహనం లభిస్తుంది. ఇది వివిధ రకాల వాణిజ్య అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.
