దేశానికి వెన్నెముకైన రైతులకు ప్రతి సీజన్ ఓ సవాలే. ముఖ్యంగా పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు పెను భారంగా మారుతున్నాయి. విత్తనాలు విత్తడం నుంచి పంటలు కోయడం వరకు.. రైతులకు ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డీజిల్ ధర పెరగడం కూడా రైతు లాభాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇప్పుడు డీజిల్ అవసరం లేని ట్రాక్టర్ భారత మార్కెట్లోకి వచ్చింది. బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ ‘మోంట్రా E27’ ట్రాక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి తెలుసుకుందాం.
మోంట్రా ఎలక్ట్రిక్ విభాగం ఉత్తర భారతదేశంలో తన మొట్టమొదటి ARAI-సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ E-27ను విడుదల చేసింది. అత్యంత శక్తివంతమైన, అధునాతన సాంకేతికతతో వచ్చిన మోంట్రా E27 ట్రాక్టర్‌లో పొగ, శబ్దం అసలే ఉండవు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.10.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 10 రాష్ట్రాలలో 17 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. రైతులకు సులభమైన ఆర్థిక సౌకర్యాలను అందించడానికి కంపెనీ అనేక సంస్థలతో చేతులు కలిపిందని కంపెనీ సీఈఓ హరీష్ ప్రసాద్ తెలిపారు. ఈ ట్రాక్టర్ ప్రత్యేకత ఏమిటంటే.. టూ-వీల్ డ్రైవ్ (2WD), ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) రెండు ఎంపికలలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఉపయోగిస్తే.. రైతులు 5 సంవత్సరాలలో రూ.10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
Also Read: Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్.. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రో-కో!
కంపెనీ ప్రకారం.. మోంట్రా E-27 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ చాలా తక్కువ శబ్దం, కంపనలను కలిగి ఉంటుంది. ఇది ఆపరేటర్‌కు (డ్రైవర్) ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తుంది. డ్రైవర్ ఎక్కువ గంటలు పని చేసినా అలసట ఉండదని కంపనీ పేర్కొంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ద్వారా 27 HP శక్తిని, 90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పొలాల్లో దున్నడం, పిచికారీ చేయడం, ట్రాలీ పనుల కోసం చాలా ఈ ట్రాక్టర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ట్రాక్టర్ 22.37 kWh LFP ప్రిస్మాటిక్-సెల్ బ్యాటరీ ప్యాక్ ద్వారా రన్ అవుతుంది. ఇది దాదాపు 4.5 గంటల రన్‌టైమ్‌ను అందిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 2.15 గంటలు పడుతుంది. డీజిల్ ట్రాక్టర్‌తో పోలిస్తే.. దీని నిర్వహణ వ్యయం దాదాపు 70 శాతం తగ్గుతుందని కంపెనీ తెలిపింది.
