భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!

Mg Hector Tomahawk

Mg Hector Tomahawk

MG Hector Tomahawk: జెఎస్‌డబ్ల్యూ-ఎమ్‌జీ మోటార్ ఇండియా(JSW-MG Motor India) భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి తన సరికొత్త 7-సీటర్(3-row)ఎస్‌యూవీ ‘ఎమ్‌జీ హెక్టర్ టోమాహాక్’ను ఘనంగా విడుదల చేసింది. సరికొత్త డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు, వినూత్న టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ మోడల్ ప్రారంభ ధరలను ఎక్స్-షోరూమ్‌లో రూ. 13.99 లక్షలు (బాస్/BaaS ఆప్షన్) అలాగే పూర్తి కొనుగోలు (Outright purchase) విధానంలో రూ. 19.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ ఆకర్షణీయమైన ప్రారంభ ధరలు కేవలం పరిమిత సంఖ్యలోని వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ ఎస్‌యూవీకి సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, ఈ సెప్టెంబర్ నుంచే టెస్ట్ డ్రైవ్‌లతో పాటు డెలివరీలు కూడా మొదలు కానున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఎక్సైట్ (Excite), ఎక్స్‌క్లూజివ్ (Exclusive), ఎస్సెన్స్ (Essence) అనే మూడు విభిన్న వేరియంట్లలో దీనిని సొంతం చేసుకోవచ్చు.

ఇక దీని డిజైన్ విషయానికి వస్తే, ఎమ్‌జీ టోమాహాక్ రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనా చూడాల్సిందే. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, డైనమిక్ టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన కొత్త బ్లాక్ గ్రిల్, ఆకర్షణీయమైన 18-ఇంచ్ డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, రేర్ ఫాగ్ లైట్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైల్స్‌తో ఈ ఎస్‌యూవీ ఎంతో ప్రీమియంగా కనిపిస్తుంది. లోపలి భాగానికి వస్తే, వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా 5-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. క్యాబిన్ లోపల ‘డెసర్ట్ స్క్వాడ్రన్’ ఇంటీరియర్ థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కార్లో అందించిన ఇన్ఫోటైన్‌మెంట్, సౌకర్యాలు అధికంగా ఉన్నాయి. 256 కలర్ల అంబియంట్ లైటింగ్, 10-స్పీకర్ల ఇన్‌ఫినిటీ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-రిట్రాక్ట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 4-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెనుక వైపు సన్‌షేడ్స్, స్లైడ్ అండ్ రీక్లైన్ ఆప్షన్ ఉన్న వెనుక సీట్లు ప్రయాణాన్ని ఎంతో హాయిగా మారుస్తాయి.

అంతేకాకుండా, ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్దదైన 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. దీనికి తోడు 8.7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 80కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, 30కి పైగా హింగ్లీష్ వాయిస్ కమాండ్స్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్, ఐ-స్వైప్+ జెస్చర్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇక, సాంకేతికత, భద్రత విషయంలో ఎమ్‌జీ టోమాహాక్ ఒక అడుగు ముందే ఉంది. నేప్, క్యాంప్, ప్రో పెట్, ఎనర్జైజ్, వాలెట్, క్వైట్ వంటి వినూత్న ఇన్-కార్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం ఈఎస్‌పీ, టీసీఎస్, హెచ్‌హెచ్‌సీ, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈపీబీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ‘లెవెల్ 2 నావిగేషన్ ఆధారిత అడాస్ (ADAS)’ వంటి సేఫ్టీ ఫీచర్లను అందించారు. వీల్ వ్యూ ఇచ్చే 360-డిగ్రీ కెమెరా, వాహనం నుంచి వేరే పరికరాలకు విద్యుత్ ఇచ్చే V2L సాంకేతికతతో పాటు భారతదేశంలోనే తొలిసారిగా వాహనం నుంచి ఇంటికి విద్యుత్ అందిచే V2H (Vehicle-to-Home) టెక్నాలజీని కూడా ఇందులో ప్రవేశపెట్టడం విశేషం.

ఎమ్‌జీ టోమాహాక్ ఎలక్ట్రిక్ (EV), అలాగే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV/ICE) ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈవీ మోడల్ విషయానికి వస్తే, ఇందులో 69.2kWh ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో 201bhp పవర్, 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది. కేవలం 8.2 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది అందుకుంటుంది. ఇక ఐసిఈ (PHEV) వెర్షన్‌లో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను 20.5kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేశారు. ఇది 198bhp పవర్, 230Nm టార్క్‌ను అందిస్తుంది. ఇంధనం అవసరం లేకుండా కేవలం బ్యాటరీపైనే 115 కిలోమీటర్ల రేంజ్ ఇస్తూ, లీటరుకు 40 కిలోమీటర్ల ఆశ్చర్యపరిచే మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఎమ్‌జీ హెక్టర్ టోమాహాక్ ఈవి వేరియంట్ వారి ధరలు (ఎక్స్-షోరూమ్) క్రింది విధంగా ఉన్నాయి:
హెక్టర్ టోమాహాక్ ఎక్సైట్ (7-సీటర్): రూ. 19.49 లక్షలు
హెక్టర్ టోమాహాక్ ఎక్స్‌క్లూజివ్ (7-సీటర్): రూ. 21.99 లక్షలు
హెక్టర్ టోమాహాక్ ఎస్సెన్స్ (5-సీటర్): రూ. 22.99 లక్షలు
హెక్టర్ టోమాహాక్ ఎస్సెన్స్ (7-సీటర్): రూ. 23.49 లక్షలు