NTV Telugu Site icon

Maruti Suzuki: వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్ కార్ల రీకాల్.. ఈ లోపమే కారణం..

Maruti Suzuki

Maruti Suzuki

Maruti Suzuki recalls 9,925 units of Wagon R, Celerio and Ignis: ప్రముఖ కార్ మేకర్ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. 9,925 యూనిట్ల వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్ కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్ లో లోపాలు ఉన్న కారణంగా ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 1 మధ్య తయారైన ఈ మోడళ్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Read Also: Mamata Banerjee: దేశంలో అధ్యక్ష తరహా పాలన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..

సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. ఈ మోడళ్ల కార్లలో వెనుక బ్రేక్ అసెంబ్లీ పిన్ లో లోపం ఉన్నట్లు భావిస్తోంది. ఇది విరిగిపోయి కొన్ని సందర్భాల్లో కార్లు విచిత్రమైన శబ్ధాలకు గురవుతోంది. దీంతో దీర్ఘకాలంలో బ్రేక్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని మారుతి సుజుకీ పేర్కొంది. కస్టమర్ల భద్రతను పరిగణలోకి తీసుకుని అనుమానిత కార్లను జాగ్రత్తగా పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు రీకాల్ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. మారుతి సుజుకీ అధీకృత వర్క్ షాపులు కస్టమర్లను సంప్రదిస్తున్నారు. కార్లను పరిశీలించిన తర్వాత విడిభాగాలను రిప్లేస్ చేయనున్నారు. కస్టమర్లు తమ కార్లతో వర్క్ షాపులను సంప్రదించానలి కోరారు.

ఇండియాలో ఎక్కువగా కార్లను విక్రయిస్తున్న కంపెనీల్లో మారుతి సుజుకీ ఒకటి. 1981లో స్థాపించబడిన ఈ సంస్థ, 2003లో జపనీస్ ఆటోమేకర్ సుజుకి మోటార్ కార్పోరేషన్ కి విక్రయించారు. అప్పటి నుంచి మారుతి సుజుకీగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 2022 నాటికి భారతీయ ప్యాసింజర్ కార్ మార్కెట్ లో మారుతి సుజుకి దాదాపుగా 44.2 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీనికి ముందు సెప్టెంబర్ 16న వాణిజ్య వాహనాలలో సీట్ బెల్టుకు సంబంధించిన సమస్యలు రావడంతో వాటిని సవరించేందుకు రీకాల్ చేసింది. ప్రస్తుతం ఇగ్నిస్, సెలెరియో, వ్యాగన్ ఆర్ వాహనాలను రీకాల్ చేసింది సంస్థ.