Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?

Maruti Suzuki India

Maruti Suzuki India

Maruti Suzuki Car Price Hike: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి కార్ల మోడళ్ల ధరలను పెంచింది. నవంబర్ 22 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇన్విక్టోపై అత్యధికంగా రూ.25,000 వరకు పెంపు ఉండగా.. స్విఫ్ట్, డిజైర్, బాలెనో, జిమ్నీ, విక్టోరిస్ వంటి మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. ఈ పెంపులో భాగంగా ఇన్విక్టో ధర గరిష్ఠంగా రూ.25,000 పెరిగింది. డిజైర్, విక్టోరిస్, స్విఫ్ట్, జిమ్నీ, బాలెనో మోడళ్లపై రూ.10,000 వరకు పెంపు విధించారు. బ్రెజా, టూర్ ఎస్, ఎర్టిగా, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్ ధరలు రూ.5,000 వరకు పెరిగాయి. ఈకో ధర గరిష్ఠంగా రూ.2,500 పెరిగింది. ఈ ధరల పెంపు వేరియంట్లను బట్టి మారుతుంది.

ఇందులో భాగంగా స్విఫ్ట్ VXi CNG AGS ధర రూ.10,000 పెరిగి రూ.8,02,400కు చేరింది. బాలెనో Delta CNG AGS ధర కూడా రూ.10,000 పెరిగి రూ.8,42,400గా ఉంది. ధరల పెంపు తర్వాత ఇన్విక్టో ప్రారంభ ధర రూ.25.27 లక్షలుగా ఉంది. డిజైర్ రూ.6.33 లక్షలు, విక్టోరిస్ రూ.10.60 లక్షలు, స్విఫ్ట్ రూ.5.84 లక్షలు, జిమ్నీ రూ.12.69 లక్షలు, బాలెనో రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక బ్రెజా రూ.7.55 లక్షలు, ఎర్టిగా రూ.8.95 లక్షలు, ఎస్-ప్రెస్సో రూ.3.50 లక్షలు, వ్యాగన్ ఆర్ రూ.4.99 లక్షలు, ఎక్స్ఎల్6 రూ.11.67 లక్షలు, ఫ్రాంక్స్ రూ.6.95 లక్షలు, ఈకో రూ.5.31 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.

పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు ఖర్చుల నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, అవి సరిపోవడం లేదని మారుతి సుజుకి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో పెరిగిన ఖర్చుల్లో కొంత భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తోందని తెలిపింది. 2026లో మారుతి సుజుకి ధరలు పెంచడం ఇది నాలుగోసారి. గతంలో జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ ధరలను సవరించింది. మరోవైపు టాటా మోటార్స్, హ్యుందాయ్ సంస్థలు డిసెంబర్ నుంచి కార్ల ధరలను పెంచనున్నాయి.