Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!

Mahindra Xev 9s

Mahindra Xev 9s

Mahindra XEV 9S Safety Rating: మహీంద్రా మరోసారి తన వాహనాల భద్రతా ప్రమాణాలను నిరూపించింది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ SUV Mahindra XEV 9S భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్.. ఈ రెండు విభాగాల్లోనూ అత్యుత్తమ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా, భారత్ NCAP పరీక్షించిన 7 సీటర్ కార్లలో అత్యధిక స్కోరు సాధించిన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.

భారత్ NCAP క్రాష్ టెస్టులో Mahindra XEV 9S అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 మార్కులకు గాను 31.15 మార్కులు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49 మార్కులకు గాను 45 మార్కులు దక్కించుకుంది. ఈ రెండు విభాగాల్లోనూ 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ రెండు స్కోర్లను కలిపితే XEV 9S మొత్తం 81 మార్కులకు 76.15 మార్కులు సాధించినట్లవుతుంది. దీంతో భారత్ NCAP పరీక్షించిన 7 సీటర్ వాహనాల్లో అత్యధిక స్కోరు సాధించిన కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. అలాగే 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందింది.

Mahindra XEV 9Sలో వేరియంట్‌ను బట్టి భద్రతా ఫీచర్లు మారుతాయి. Pack One Above, Pack Two Above వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు అందిస్తున్నారు. Pack Three, Pack Three Above వేరియంట్లలో డ్రైవర్ నీ ఎయిర్‌బ్యాగ్ కూడా ఉండటంతో మొత్తం ఎయిర్‌బ్యాగుల సంఖ్య ఏడుకు చేరుతుంది. ఇందులో ఐదు రాడార్లు, ఒక కెమెరాతో కూడిన Level 2 ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రమాదాలను నివారించడంలో సహాయపడే పలు ఆటోమేటిక్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పార్కింగ్‌ను సులభతరం చేయడంతో పాటు బ్లైండ్ స్పాట్‌లను గుర్తించేందుకు 360 డిగ్రీ, 540 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాలను అందించారు.

మెరుగైన బ్రేకింగ్ కోసం నాలుగు చక్రాలకూ డిస్క్ బ్రేకులు ఇచ్చారు. వాహనం అదుపు తప్పకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), హిల్ డిసెంట్ కంట్రోల్, డ్రైవర్ అలసట హెచ్చరిక వ్యవస్థ, Secure 360 Pro వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), పిల్లల సీట్ల కోసం ISOFIX యాంకర్లు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఈ SUVలో ఉన్నాయి.

భారత్ NCAP పరీక్షల్లో పలు కార్లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించాయి. అందుబాటులో ఉన్న జాబితా ప్రకారం Mahindra XEV 9e, Tata Harrier EVలు 81 మార్కులకు 77 మార్కులతో అత్యధిక స్కోరు సాధించాయి. Mahindra BE 6 మొత్తం 76.97 మార్కులతో తర్వాతి స్థానంలో ఉంది. Mahindra XEV 9S 76.15 మార్కులతో ఈ జాబితాలో నిలిచింది. అయితే 7 సీటర్ వాహనాల విభాగంలో దీని స్కోరు ప్రత్యేక గుర్తింపు పొందింది.

భారత్‌లో Mahindra XEV 9S ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.16.62 లక్షల నుంచి రూ.30.90 లక్షల వరకు ఉంది. ధర, ఫీచర్లు, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో పాటు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఈ SUVకి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ SUVకి Tata Harrier EV, Kia Carens Clavis EV వంటి మోడళ్ల నుంచి పోటీ ఉంది. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV కొనుగోలు చేయాలనుకునే వారికి Mahindra XEV 9S ఒక మెయిన్ ఆప్షన్ గా నిలవనుంది.