Mahindra Car Sales: GST రేట్ల తగ్గింపు, నవరాత్రి పండుగ సీజన్ కావడంతో కార్ల అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను కనిపించింది. విశ్లేషకులు గత సెప్టెంబర్ నెలను భారత ఆటోమొబైల్ పరిశ్రమకు చారిత్రాత్మక నెలగా చెప్పవచ్చని అంటున్నారు. ఈనెలలో మహీంద్రా & మహీంద్రా కంపెనీ తన అత్యధిక కార్ల అమ్మకాల రికార్డును సాధించింది. సెప్టెంబర్‌లో కంపెనీ 56,233 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, గత ఏడాది అక్టోబర్‌లో నెలకొల్పిన దాని స్వంత రికార్డును ఈ కంపెనే బద్దలు కొట్టింది.
READ ALSO: Theft: కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా.. రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కొట్టేసిన మహిళ(వీడియో)
రికార్డు స్థాయిలో అమ్మకాలు
మహీంద్రా సెప్టెంబర్ 2024లో 51,062 వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది ఆ సంఖ్య 10% పెరిగింది. ఇంకా కంపెనీ మొత్తం ఆటో అమ్మకాలు (దేశీయ + ఎగుమతి) 16% వృద్ధి చెంది 100,298 వాహనాలకు చేరుకున్నాయి. SUV లు మాత్రమే కాకుండా తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రీ-వీలర్లు కూడా పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరిగాయి. వాహన అమ్మకాలు పెరగడానికి అతిపెద్ద కారణాలు GST 2.0, నవరాత్రి సీజన్ అని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 అమ్మకాల జోరును ప్రభావితం చేసిందని అంటున్నారు. ప్రభుత్వం చిన్న వాహనాలపై పన్నును 28% నుంచి 18%కి తగ్గించింది. అలాగే పరిహార సెస్‌ను కూడా తొలగించింది. కాంపాక్ట్ SUVలు, చిన్న కార్లు తాజా జీఎస్టీ సంస్కరణల నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందాయి. మహీంద్రా కూడా పూర్తి పన్ను ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించింది. దీంతో అనేక మోడళ్లపై ₹1 లక్షకు పైగా ధర తగ్గింపులు జరిగాయి.
అడ్డంకిగా మారిన లాజిస్టిక్స్..
ఈసందర్భంగా మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ CEO నళినీకాంత్ గల్లగుంట మాట్లాడుతూ.. “GST 2.0, నవరాత్రి మొదటి తొమ్మిది రోజులు విపరీతమైన డిమాండ్ ఉంది. SUV సెగ్మెంట్ 60% వరకు పెరిగింది” అని అన్నారు. అయితే అమ్మకాల్లో బలమైన పెరుగుదల ఉన్నప్పటికీ, సెప్టెంబర్ చివరి 10 రోజుల్లో ట్రైలర్ల కొరత కారణంగా డీలర్‌షిప్‌లకు వాహనాల డెలివరీలకు ఆటంకంగా మారిందని, దీంతో ఊహించిన దానికంటే తక్కువ అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది.
సెప్టెంబర్‌లో మహీంద్రా మొత్తం అమ్మకాలు:
మొత్తం వాహన అమ్మకాలు (దేశీయ + ఎగుమతులు): 1,00,298 యూనిట్లు (16% వృద్ధి)
మొత్తం SUV అమ్మకాలు (ఎగుమతులు సహా): 58,714 యూనిట్లు
దేశీయ వాణిజ్య వాహనాలు: 26,728 యూనిట్లు (18% వృద్ధి)
తేలికపాటి వాణిజ్య వాహనాలు (2–3.5 టన్నులు): 23,342 యూనిట్లు (21% వృద్ధి)
త్రిచక్ర వాహనాలు (ఎలక్ట్రిక్ వాహనాలు సహా): 13,017 యూనిట్లు (30% వృద్ధి)
ఎగుమతులు: 4,320 యూనిట్లు (43% వృద్ధి)
నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది..
ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి GST సంస్కరణలను ప్రకటించారని తెలిసిందే. దీని తరువాత GST తగ్గింపు గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈక్రమంలో ఆగస్టు నెలలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు వాళ్ల వాహనాల కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఈక్రమంలో ఆ నెలలో అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. దీంతో డీలర్లు కూడా తమ ఇన్వెంటరీని తగ్గించుకున్నారు. అయితే సెప్టెంబర్ 22న సంస్కరణలు అమల్లోకి రావడం, నవరాత్రి ప్రారంభమైన వెంటనే మార్కెట్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇవి సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలకు దారితీసింది.
ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్ 2025) మొదటి ఆరు నెలల్లో మహీంద్రా 297,570 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 14% పెరుగుదల అని అంటున్నారు నిపుణులు. వాణిజ్య వాహనాలలో కూడా కంపెనీ 18% వృద్ధిని నమోదు చేయడం, ఎగుమతులు 43% మేర పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. GST 2.0, పండుగ సీజన్ కావడం ముఖ్యంగా వాహనాల అమ్మకాలకు ఊతం ఇచ్చాయని చెబుతున్నారు. రాబోయే నెలల్లో కూడా మహీంద్రా వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
READ ALSO: Grokipedia: వీకీపీడియా కాదు గ్రోకిపీడియా.. ఎలాన్ మస్క్ నయా సంచలనం