Hyundai Creta EV: భారతదేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ కార్లకు జనాదరణ పెరుగుతోంది. దేశీ కార్ మేకర్స్ అయిన టాటా, మహీంద్రాలు ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో కొత్త కార్లను తీసుకువచ్చాయి. విదేశీ కార్ మేకర్స్ కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం టాటా ఈవీ కార్ విభాగంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. టాటాలో టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్ ఈవీ కార్లు ఉన్నాయి. బలమైన ఈవీ ఫోర్ట్‌పోలియోని టాటా కలిగి ఉంది. తాజాగా మహీంద్రా తన BE 6e, XEV 9e కార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడున్న ఈవీలతో పోలిస్తే మరిన్ని అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్లతో కార్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది.
తాజాగా హ్యుందాయ్ తన ఏస్ కార్ క్రెటాని ఈవీ అవతార్‌లో తీసుకురాబోతోంది. క్రెటా EVని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో విడుదల చేయబోతోంది. జనవరి 17 నుంచి 22 వరకు ఈ ఆటో ఎక్స్‌పో కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు క్రెటా EV లాంచ్ జనవరి 17న జరుగుతుంది. ఇది మహీంద్రా BE 6e, టాటా Curvv EV, MG ZS EV , రాబోయే మారుతి సుజుకి e విటారాకు పోటీగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీని తీసుకువస్తే, ఆ కంపెనీ నుంచి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుంది. ఇప్పటికే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 కార్లను కలిగి ఉంది.
క్రెటా EV తమిళనాడులోని హ్యుందాయ్ యొక్క శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుంది. క్రెటా EV ఉత్పత్తికి ప్లాంట్‌లో సన్నాహాలు ప్రారంభించినట్లు కంపెనీ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ గోపాలకృష్ణన్ సిఎస్ తెలిపారు. క్రెటా EV పెట్రోల్, డిజిల్ క్రెటా డిజైన్‌ని కలిగి ఉంటుంది. అయితేర క్లోడ్జ్ ఫ్రంట్ గ్రిల్ రీడిజైన్ చేయబడుతుంది. ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డ్రైవర్ కన్సోల్ కోసం ట్విన్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు లెవెల్ 2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా మరియు వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి.
క్రెటా EV యొక్క స్పెసిఫికేషన్‌లపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఇది 50kWh LFP బ్యాటరీ వస్తుందని భావిస్తున్నారు. ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ -500 కి.మీ రేంజ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ధర విషయాని వస్తే రూ. 18 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.