Site icon NTV Telugu

సేఫ్టీలో సంచలనం సృష్టించిన Honda Amaze.. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 5 స్టార్ రేటింగ్..!

Honda Amaze

Honda Amaze

Honda Amaze: హోండా మోటార్స్‌కి చెందిన మూడో తరం హోండా అమేజ్ (Honda Amaze) సేఫ్టీ విభాగంలో 5 స్టార్ రేటింగ్ అందుకుంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఈ కాంపాక్ట్ సెడాన్ పెద్దల భద్రతకు 5 స్టార్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పటివరకు అమేజ్ సంపాదించిన అత్యుత్తమ సేఫ్టీ స్కోర్ ఇదే కావడంతో.. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యంత భద్రమైన ఫ్యామిలీ సెడాన్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

భారత్ NCAP (భారతదేశ అధికారిక క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్), Global NCAP, Euro NCAP స్థాయి కఠిన ప్రమాణాల ప్రకారం వాహనాలను పరీక్షిస్తుంది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్, సైడ్ ఇంపాక్ట్, చైల్డ్ సీట్ ఇన్‌స్టలేషన్ వంటి అనేక కీలక పరీక్షల ద్వారా వాహనాల భద్రతను అంచనా వేస్తారు. అయితే 5-స్టార్ రేటింగ్ అంటే వాస్తవ ప్రమాదాల్లో ప్రయాణికులను అత్యుత్తమంగా రక్షించగల సామర్థ్యం ఉన్నట్లు సూచిస్తుంది.

ChatGPT: టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించిన OpenAI.. ఏం చెప్పిందంటే?

ఈ పరీక్షల్లో Honda Amaze అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ టెస్ట్ లో 16లో 14.33 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ లో 16లో 14 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం అడల్ట్ ప్రొటెక్షన్ డైనమిక్ స్కోర్ 24లో 23.81గా నమోదైంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, సైడ్ థోరాక్స్ ఎయిర్‌బ్యాగ్స్, బెల్ట్ ప్రీటెన్షనర్లు, లోడ్ లిమిటర్లు, ESC, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి సేఫ్టీ సిస్టమ్స్ ఈ కారును మరింత భద్రంగా మార్చాయి.

మరోవైపు పిల్లల భద్రత విభాగంలోనూ అమేజ్ మంచి ప్రదర్శననే కనబర్చింది. చైల్డ్ రిస్ట్రైంట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టలేషన్‌లో 12/12 పర్ఫెక్ట్ స్కోర్ సాధించింది. 3 ఏళ్ల పిల్లాడికి 8లో 7.81, 18 నెలల శిశువుకు 8/8 డైనమిక్ స్కోర్ నమోదయ్యాయి. ISOFIX‌తో లెగ్ సపోర్ట్ ఉండటం వల్ల రియర్-ఫేసింగ్ చైల్డ్ సీట్లు మరింత భద్రంగా అమర్చుకునే అవకాశం లభించింది. ఇది చిన్నపిల్లల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రపంచంలోనే తొలి 8300mAh బ్యాటరీ ఫ్లాగ్‌షిప్‌గా OnePlus Ace 6T డిసెంబర్ 3న లాంచ్..!

వీటితోపాటు ABS విత్ EBD, సీట్‌బెల్ట్ రిమైండర్లు, ఎయిర్‌బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్, రియర్ డీఫాగర్, చైల్డ్ సేఫ్టీ లాక్స్ వంటి ఇతర ఆధునిక భద్రతా ఫీచర్లు అమేజ్ సేఫ్టీ ప్రమాణాలను మరింత బలోపేతం చేశాయి. మొత్తం మీద బలమైన బాడీ స్ట్రక్చర్, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు, అద్భుతమైన క్రాష్ టెస్ట్ ఫలితాలతో హోండా అమేజ్ ప్రస్తుతం భారత మార్కెట్‌లో అత్యంత భద్రమైన కాంపాక్ట్ సెడాన్‌లలో ఒకటిగా నిలిచింది.

Exit mobile version