NTV Telugu Site icon

Ratan Tata: టాటా ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు.. భారత ఆటో ఇండస్ట్రీపై చెరగని సంతకం రతన్ టాటా..

Tata

Tata

Ratan Tata: రతన్ టాటా.. భారత పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేశారు. గుండు సూది నుంచి విమానాల వరకు అనేక కంపెనీలతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రతన్ టాటా చెరగని ముద్ర వేశారు. ఇండికా నుంచి మొదలైన టాటా మోటార్స్ ప్రస్థానం ఇప్పుడు టాటా నెక్సాన్.ఈవీ దాకా కొనసాగింది. ప్రస్తుతం ఇండియాలో ఈవీ కార్‌లలో టాటా తిరుగులేని స్థానంలో ఉంది.

డిజిల్ ఆధారిత ‘‘ఇండికా’’ కారుని తీసుకువచ్చినప్పుడు పెద్దగా సేల్స్ లేకపోవడంతో పొడక్షన్ యూనిట్‌ని అమ్మేద్దామని రతన్ టాటా అనుకున్నారు. ప్రముఖ బ్రిటిష్ ఆటోమేకర్ కంపెనీ ఫోర్డ్‌‌తో డీల్ కుదుర్చుకునేందుకు వెళ్తే, సదరు సంస్థ సీఈఓ టాటాని అవమానించారు. చివరకు ఫోర్డ్ దివాళా తీసే పరిస్థితుల్లో దాని బ్రాండ్స్ ‘‘జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్’’ని కొనుగోలు చేశారు. టాటా చేతిలో పడిన తర్వాత ఈ బ్రాండ్స్ లాభాల బాట పట్టాయి. తనను అవమానించిన కంపెనీ బ్రాండ్లను టాటా కొనుగోలు చేయడం ఓ సంచలనం.

Read Also: Ratan Tata Dog: రతన్ టాటా భౌతికకాయం దగ్గర దీనంగా కూర్చున్న కుక్క

ఇండికా కార్ తర్వాత అనతి కాలంలోనే టాటా మోటార్స్ దేశీయం, విదేశాల్లో సత్తా చాటింది. టాటా కార్లు నమ్మకానికి కేరాఫ్‌గా ఉన్నాయి. టాటా మోటార్స్‌కి చెందిన నెక్సాన్ దేశంలోనే తొలి ఎన్-కాప్ రేటింగ్స్‌లో 5-స్టార్ సాధించిన తొలి కారుగా రికార్డుకెక్కింది. టాటా కార్లలో టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారీ ఇవన్నీ ప్రయాణికులు సేఫ్టీకి తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. తమ కార్లను ప్రమాదాలను తట్టుకునే విధంగా బిల్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్‌ల సెగ్మెంట్‌లో టాటా టాప్ ప్లేస్‌లో ఉంది. మహీంద్రా, బీవైడీ, ఎంజీ వంటి ప్లేయర్లు మార్కెట్‌లో ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది టాటా మోటార్స్ ఈవీ కార్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈవీ కేటగిరిలో దేశవ్యాప్తంగా నెక్సాన్. ఈవీ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈవీ ఫోర్ట్‌ఫోలియోలో టియాగో, టిగోర్, నెక్సాన్, కర్వ్ వంటి ఈవీ కార్లు ఉన్నాయి. త్వరలోనే టాటా హారియర్ ఈవీ కూడా రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఎలాన్ మస్క్ ‘టెస్లా’ ఫేమస్. కానీ టెస్లా కారు కంటే ఎంతో చౌకగా అంటే రూ. 20 లక్షల లోపే అధునాతన ఫీచర్లు, అధిక రేంజ్, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టాటా ఈవీ కార్లు ఉన్నాయి.