Tesla: ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలోకి ఎలక్ట్రిక్ కార్ మేకర్ దిగ్గజం ‘టెస్లా’ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా భారత్‌లో కార్‌ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం అధ్యయనం చేస్తోంది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలపై దృష్టి సారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 2 బిలియన్ల పెట్టుబడితో ఇండియాలో కార్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం టెస్లా సిద్ధమవుతోంది.
Read Also: NCERT: 12 తరగతి సిలబస్ నుంచి బాబ్రీ కూల్చివేత, గుజరాత్ అల్లర్ల అంశాలు తొలగింపు..
గతంలో టెస్లా కార్ల దిగుమతిపై భారీ సుంకాలను విధించిన ఇండియా, నూతనంగా తీసుకున్న విధానంలో 500 మిలియన్ల పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తే, ఆ కంపెనీల దిగుమతులపై పన్ను రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టెస్లా పరిమిత సంఖ్యలో కార్లను ఇండియాలోకి దిగుమతి చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, ఏడాదికి 8000 కార్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టెస్లా జర్మనీలో భారత్ కోసం కార్‌లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి దేశంలోకి కార్‌లను దిగుమతి చేయనున్నారు. భారతదేశంలో వినియోగించేందుకు రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్లు(RHD)లను ఉత్పత్తి చేస్తోంది. యూఎస్, చైనా మార్కెట్లలో ఈవీల డిమాండ్ మందగించడం, చైనీస్ ఈవీ కార్లలో ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో టెస్లా భారత్‌పై దృష్టి సారించింది. టెస్లా ఇప్పటికే భారత్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటోంది. చైనా నుంచి సోర్సింగ్ తగ్గించి, భారతదేశాన్ని తన పెద్ద సోర్సింగ్ హబ్‌గా మార్చాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది.