NTV Telugu Site icon

BYD Atto 3: భారత మార్కెట్ లోకి బీవైడీ ఈవీ కార్.. నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఈవీ, కోనాలకు పోటీ..

Byd Atto 3

Byd Atto 3

BYD Atto 3 EV car will enter the Indian market: చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ ( బిల్డ్ యువర్ డ్రీమ్) భారత మార్కెట్ లోకి కొత్తగా ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. బీవైడీ ఆట్టో 3 పేరుతో ఈవీ కారును లాంచ్ చేయబోతోంది. రూ. 50,000లతో ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీని బుక్ చేసుకోవచ్చు. అయితే కారుకు సంబంధించిన ధరల వివరాలు మాత్రం వచ్చే నెల నవంబర్ లో ప్రకటించబడతాయని కంపెనీ ప్రకటించింది. మొదటి 500 కార్ల డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది.

అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో బీవైడీ అట్టో 3కి ప్రత్యర్థులుగా టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు బాగానే అమ్ముడు అవుతున్నాయి. భారత ఈవీ కార్ల అమ్మకాల్లో టాటా నెక్సాన్ ఈవీ టాప్ లో ఉంది. ఇటీవల ఈ కంపెనీ తీసుకురాబోతున్న హ్యచ్ బ్యాక్ కార్ టియాగో ఈవీకి కూడా విపరీతమైన స్పందన వచ్చింది. మొదటగా 10 వేల కార్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటే.. డిమాండ్ పెరగడంతో మరో 10,000 కార్ల బుకింగ్స్ ను ప్రారంభించింది టాటా.

Read Also: Divya- Arnav Case: ముదిరిన టీవీ నటి భర్త ఎఫైర్.. ముద్దులు పెడుతూ ఆడియో కాల్ లీక్

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాబోతున్న బీవైడీ ఆట్టో రేంజ్ పరంగా ఇప్పుడు భారత్ లో ఉన్న అన్ని ఈవీ కార్ల కన్నా ఎక్కువ రేంజ్ ఇవ్వనుంది. బీవైడీ ఆట్టో 3 ఈవీ కారు 310 న్యూటన్ మీటర్ టార్క్ తో 201 హార్స పవర్ ను జనరేట్ చేస్తుంది. 60.48 కిలోవాట్ అవర్ బ్యాటరీ తో ఏకంగా 521 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. హ్యుందాయ్ కోనా 395 న్యూటన్ మీటర్ టార్క్ తో 134 హార్స్ పవర్ ను జెనరేట్ చేస్తుంది. దీంట్లో 39.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ సాయంతో 452 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది.

ఇక ఎంజీ జెడ్ ఎస్ ఈవీ 174 హెచ్పీ, 250 ఎన్ఎం శక్తిని ఇస్తుంది. దీంట్లో ఉండే 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ 461 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. చివరగా దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ మాక్స్ 141 హెచ్పీతో 250 ఎన్ఎం పవర్ జనరేట్ చేస్తుంది. దీంట్లో ఉండే 4035 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 437 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. ఈవీ కార్లన్నింటిలో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను ఉపయోగిస్తున్నారు.

బీవైడీ అట్టో3 ధరలు నవంబర్ లో ప్రకటించబడతాయి. ప్రస్తుతం హ్యుందాయ్ కోనా ఈవీ ధర రూ. 23.84 లక్షల నుంచి రూ. 24.03 లక్షలు( ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఎంజీ జెడ్ ఎస్ ఈవీ ధర రూ. 22.58 లక్షల నుండి రూ. 26.60 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ. 18.34 లక్షల నుండి రూ. 19.84 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

Show comments