Site icon NTV Telugu

Bike Rider Protection Jacket: బైక్ రైడర్ల కోసం ఎయిర్‌బ్యాగ్‌లు.. ధర ఎంత అంటే?

Bike Rider Protection Jacke

Bike Rider Protection Jacke

Bike Rider Protection Jacket: రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోయే బైక్ రైడర్లకు ఇక ఏమాత్రం డోకాలేదు. వాస్తవానికి మోటార్ సైకిలిస్టుల ప్రాణాలకు రోడ్డుపై అత్యంత ప్రమాదం పొంచి ఉంటుంది. హై-ఎండ్, హై-స్పీడ్ బైక్‌లు మార్కెట్‌లోకి వస్తున్నప్పటికీ, ఇప్పటికీ రైడర్ల భద్రత మాత్రం దేవుని దయపైనే ఆధారపడి ఉంది. హెల్మెట్ ధరించడం ఒక అలవాటుగా మారింది, కానీ ప్రమాదం జరిగినప్పుడు, తల కాకుండా ఇతర శరీర భాగాలు, ఛాతీ, వెన్నెముక, మెడ వంటి శరీర భాగాలు తీవ్రంగా గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ద్విచక్ర వాహన ప్రమాదాల సమయంలో ఎక్కువ సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిని తగ్గించడానికి ఇక బైక్ రైడర్ల కోసం ఎయిర్ బ్యాగ్‌లు రాబోతున్నాయి.

READ ALSO: Delhi Car Blast: 26/11 తరహా దాడులకు కుట్ర, 200పైగా ఐఈడీలో విధ్వంసానికి ప్లాన్..

ఈ ఎయిర్ బ్యాగ్ ఎలా ఉందంటే?
ప్రాణాలను కాపాడటానికి కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్టులు వంటి అనేక సాంకేతికతలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ద్విచక్ర వాహన రైడర్లకు అలాంటి ఫీచర్లు అందుబాటులో లేవు. కానీ ఇకపై అలా ఉండదు. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ నియోకవాచ్, బైక్ రైడర్ల కోసం దేశంలో మొట్టమొదటి “తెలివైన ధరించగలిగే ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్”ను ప్రారంభించింది. దీనిని నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ అని పిలుస్తున్నారు. నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ అనేది రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులను ఛాతీ, వెన్నెముక, మెడకు తీవ్రమైన గాయాల నుంచి రక్షించడానికి రూపొందించిన ఒక భద్రతా పరికరం. అత్యాధునిక సాంకేతికత అమర్చిన ఈ ఎయిర్ వెస్ట్, క్రాష్ లేదా పడిపోయిన సందర్భంలో 100 మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయంలోనే ఓపెన్ అయ్యి, రైడర్‌కు రక్షణను అందిస్తుంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది ద్విచక్ర వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 70% కేసుల్లో శరీర పైభాగానికి తీవ్రమైన గాయాలు అవుతున్నాయి. 2023లో ద్విచక్ర వాహన ప్రమాదాల వల్ల 79,533 మంది మరణించారు, ఇది భారతదేశంలోని మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో 45.8%. ఈ ప్రమాదాన్ని తగ్గించడమే నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైడర్ వెన్నెముక యొక్క హైపర్‌ఫ్లెక్షన్‌ను నిరోధిస్తుంది, అలాగే షాక్ ప్రభావాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా అధిక వేగంతో ఢీకొనడం లేదా ఆకస్మికంగా పడిపోవడం వంటి పరిస్థితులలో రైడర్‌కు రక్షణ కల్పిస్తుందని తయారీ సంస్థ తెలిపింది.

జాకెట్ లాగా ధరించవచ్చు..
నియోకావాచ్ నుంచి వచ్చిన ఈ ఎయిర్‌వెస్ట్‌ను సాధారణ జాకెట్ లాగా ధరించవచ్చు. ఈ జాకెట్ ఇతర ఎలక్ట్రానిక్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ల కంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనికి ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్‌స్క్రిప్షన్‌లు అవసరం లేదు. ఇది ప్రమాదం జరిగినప్పుడు స్వయంచాలకంగా మోహరించే మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ సిస్టమ్‌పై ఆధారపడి పని చేస్తుంది. ఈ ఎయిర్ వెస్ట్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే దీనిని రీసెట్ చేయవచ్చు, అమర్చిన తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. ఇది ఆచరణాత్మకమైనది మాత్రమే కాకుండా అత్యంత ఆర్థిక ఎంపిక కూడా అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వెస్ట్ 28 లీటర్ల ఎయిర్‌బ్యాగ్ కవరేజీని అందిస్తుంది, దీని తేలికైన డిజైన్ రోజువారీ ఉపయోగం కోసం అనుకూలంగా ఉంటుంది. దీనిని భారతదేశంలో తయారు చేశారు. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ ఎయిర్ వెస్ట్ కోసం నియోకావాచ్ ప్రారంభ ధరను రూ.32,400గా నిర్ణయించింది. ఈ ఎయిర్ వెస్ట్‌తో కంపెనీ తన సేఫ్టీ గేర్ లైనప్‌ను విస్తరించింది. దీంతో పాటు కంపెనీ రెండు అదనపు ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది. నియోకావాచ్ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్రో, టెక్‌ప్యాక్ ఎయిర్, ఇవి వేర్వేరు ఉపయోగాలు కలిగి ఉన్నాయి. నియోకవాచ్ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్రో ధర రూ.40,800 గా నిర్ణయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మోటార్ సైకిల్ రైడర్ల కోసం దీనిని రూపొందించారు. రక్షణాత్మక ప్యాడింగ్, నిల్వ పనితీరు, ఎర్గోనామిక్ సౌకర్యాన్ని మిళితం చేస్తుందని, ఇది నగర, సుదూర రైడింగ్ రెండింటికీ అనువైనదిగా ఉంటుందని చెబుతున్నారు. నియోకవాచ్ టెక్‌ప్యాక్ ఎయిర్ ధర రూ.36 వేలుగా నిర్ణయించారు. ఇది తేలికైన బ్యాక్‌ప్యాక్. రోజువారీ ఉపయోగం కోసం ఇది అనువైనది, అలాగే ఇది అత్యుత్తమ వీపు రక్షణ, మొబిలిటీ మద్దతును అందిస్తుంది. భద్రత, సౌలభ్యాన్ని కోరుకునే వారి కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ మూడు సేఫ్టీ గేర్‌లను ఇప్పుడు కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి, రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. రైడర్ సేఫ్టీ రంగంలో నియోకావాచ్ తీసుకున్న ఈ అడుగు ఒక ప్రధాన సాంకేతిక ఆవిష్కరణ అని నిపుణులు చెబతున్నారు.

READ ALSO: The Girlfriend: 20 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన గర్ల్ ఫ్రెండ్

Exit mobile version