చాలా మంది దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు.. దాని లుక్-డిజైన్‌పై మాత్రమే దృష్టి పెడుతుంటారు. ఇవే కాకుండా కారు భద్రతా ఫీచర్లను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ సమయంలో ఈ ఫీచర్లు మిమ్మల్ని రక్షిస్తాయి. మీ కారులో ఉండాల్సిన 10 భద్రతా ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
1. ఎయిర్ బ్యాగ్స్: కారు ఏదైనా ఎయిర్‌బ్యాగ్ ఉండటం చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన భద్రతా ఫీచర్. ఇది అత్యవసర పరిస్థితిలో ప్రాణాలను కాపాడుతుంది. కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఉంటే అంత మంచిది.
2. సీట్ బెల్ట్ : మీరు కొనే కారులో కచ్చితంగా ప్రిటెన్షనర్స్తో ఉన్న సీట్ బెల్ట్స్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈ ప్రీటెన్షనర్స్ ఉన్న సీట్ బెల్ట్‌లు ఆటోమేటిక్‌గా బిగుతుగా మారతాయి. కనుక ప్రయాణికులు కారు ముందు భాగాన్ని గుద్దుకునే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
3. ఏబీఎస్ : సడెన్‌గా బ్రేక్స్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా ‘యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్’ (ఏబీఎస్) నిరోధిస్తుంది. దీని వల్ల డ్రైవర్ స్టీరింగ్‌ను ఈజీగా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. బండి స్కిడ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది.
4. ఈఎస్‌సీ : ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) అనేది వాహనం స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. లాస్ ఆఫ్ ట్రాక్షన్‌ను గుర్తించి, తగ్గిస్తుంది. మలుపులు తిరిగేటప్పుడు, బాగా జారుడుగా ఉన్న రోడ్లపై వెళ్లేటప్పుడు ఈఎస్‌సీ బండికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా కాపాడుతుంది.
5. ఈబీడీ : ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ) అనేది ఇండివిడ్యువల్ వీల్స్ మధ్య బ్రేకింగ్ ఫోర్స్‌ను పంపిణీ చేస్తుంది. దీని వల్ల కార్ బ్రేకింగ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసి, బండి స్థిరంగా ఉండేలా చేస్తుంది.
6. టీసీఎస్ : జారుడు ఉపరితలంపై యాక్సిలిరేషన్ చేసేటప్పుడు వీల్ స్పిన్ కాకుండా ‘ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్’ (టీసీఎస్) కాపాడుతుంది. అలాగే ఇది కారు ట్రాక్షన్‌ను, కంట్రోల్‌ను మెరుగుపరుస్తుంది.
7. టీపీఎమ్‌ఎస్ : కారు టైర్లలో సరిపోయినంత ప్రెజర్ లేనప్పుడు, ఈ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వెంటనే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. దీని వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఫలితంగా వాహనం కూడా భద్రంగా ఉంటుంది.
8. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్/ కెమెరా : కాస్త ఇరుకైన ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేసేటప్పుడు రివర్స్ పార్కింగ్ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాదచారులను లేదా అడ్డంకులను కారు ఢీకొనే ప్రమాదం బాగా తగ్గుతుంది.
9. ఏఈబీ: ఈ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ముందుగానే వాహనం ఢీకొనే ప్రమాదాన్ని గుర్తించి, ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది. ఫలితంగా భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
10. ఎల్‌డీడబ్య్లూ : మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా లేన్ నుంచి బయటకు వెళితే, ఈ లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ (ఎల్డీడబ్ల్యూ) డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. కనుక వాహన ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.