Site icon NTV Telugu

YSRCP Plenary 2022: ముగిసిన వైసీపీ తొలిరోజు ప్లీనరీ.. నాలుగు తీర్మానాలకు ఆమోదం..

Ysrcp Plenary

Ysrcp Plenary

రెండు రోజుల పాటు జరుగుతోన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి.. సాయంత్రం 5 గంటల తర్వాత తొలిరోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్.. ప్లీనరీ వేదికపై దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశాలకు వైఎస్‌ విజయమ్మ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరు కావడంతో పండగలా వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సాగింది.. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. సాగిన మంత్రులు, నేతల ఉపన్యాసాలు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి..

Read Also: Live : సీఎం కుర్చీని టచ్ చేయండి చూద్దాం | Anil Kumar Yadav Aggressive Speech | Ysrcp Plenary 2022

ఇక, తొలిరోజు ప్లీనరీ సమావేశాల్లో నాలుగు తీర్మానాలు చేశారు.. మహిళా సాధికారత-దిశ చట్టంపై తొలి తీర్మానం చేయగా, విద్యా రంగంలో సంస్కరణలపై రెండో తీర్మానం, నవరత్నాలు-డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌)పై మూడో తీర్మానం, వైద్యారోగ్య రంగంపై నాలుగో తీర్మానం చేశారు మంత్రులు.. ఇక, ఈ తీర్మానాలకు ప్లీనరీ ఆమోదం తెలిపింది.. మరోవైపు, 2019లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించాం. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు పరిమితం చేశాడు దేవుడు. అధికారం అంటే అహంకారం కాదని నిరూపించాం అని వ్యాఖ్యానించారు సీఎం జగన్. ఇక, ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని అన్నారు వైఎస్‌ విజయమ్మ. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు.. జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారని ప్రశంసించారు. జగన్‌ మాస్‌ లీడర్‌.. యువతకు రోల్‌ మోడల్‌.. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నానన్నారు. మొత్తంగా భారీ సంఖ్యలో హాజరైన ప్రతినిధులు.. వారి కోసం ఏర్పాటు చేసిన వంటకాలు.. నేతల ఉపన్యాసాలు.. ఇలా తొలిరోజు ఉత్సాహవంతమైన వాతావరణంలో వైసీపీ ప్లీనరీ ముగిసింది.. రెండు రోజుల పాటు సాగనున్న ప్లీనరీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.

Exit mobile version