NTV Telugu Site icon

BC Atmiya Samavesam: 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.. వాటిపైనే బీసీ ఆత్మీయ సమ్మేళనం ఫోకస్‌..!

Pilli Subhash Chandra Bose

Pilli Subhash Chandra Bose

బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… ఈ నెల 7వ తేదీన బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో బీసీ మంత్రులు, అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈనెల 7న జరిగే బీసీ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించనున్న అంశాలను వివరించారు ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్. మూడు ప్రధాన అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు పిల్లి సుభాష్‌ చంద్రబోస్.. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ పరిమితి పెంచాలని గతంలో చేసిన ప్రతిపాదన పరిగణలోకి తీసుకోవాలి.. బీసీ జనగణన జరగాలి.. వెనుకబడిన వర్గాల ఆదాయపరిమితి 8 లక్షల నుండి 25 లక్షలకు పెంచాలన్న మూడు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్‌ను కోరతామని వెల్లడించారు.

Read Also: Minister Mallareddy: రెండోసారి ఐటీ విచారణకు హాజరైన మంత్రి మల్లారెడ్డి కుమారుడు

ఇక, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు పెద్దపేట వేసింది సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రశంసించారు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.. అత్యధికంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, చట్టసభల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించడం సీఎం వైఎస్ జగన్ వల్లే సాధ్యమైందన్నారు.. ఇప్పటి మా డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సీఎంను కోరతామన్న ఆయన.. చంద్రబాబుకు బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.. తన హయాంలో చంద్రబాబు బీసీలకు న్యాయమూర్తుల పదవులు ఇవ్వొద్దని కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాయటం ప్రజలు మర్చిపోలేదన్నారు.. బీసీలు మీ ఇంట్లో పాలేరు పనులకు మాత్రమే పనికి వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్.. మరోవైపు.. బీసీలకు అత్యధిక అవకాశాలు కల్పించింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని కొనియాడారు ఎంపీ భరత్… 2019 ఎన్నికల్లోనే ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి ఎంపీ స్థానాన్ని నాకు కేటాయించారని గుర్తుచేసుకున్న ఆయన… చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని ఆరోపించారు.. కేవలం కమిషన్ల కోసమే పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు కేంద్రం నుంచి తీసుకున్నారంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ భరత్‌.