NTV Telugu Site icon

Kotamreddy Sridhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్‌.. మంత్రులు, కలెక్టర్లు మారారు.. పనులు మాత్రం కావడం లేదు..!

Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో అధికారులు.. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. అయితే, ఈ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారారు.. కానీ, నా పనులు మాత్రం కావడం లేదని దుయ్యబట్టారు.. వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్‌ పనులు చేపట్టలేదని.. దీంతో, 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందన్నారు.. దీనికి ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు. బారాషాహిద్ దర్గాకు రూ.10కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసినా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అనుమతి ఇవ్వలేదన్నారు. బీసీ భవన్ నిర్మాణ పనులు కూడా మిగిలిపోయాయి.. నిధులు రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని తెలిపారు.

Read Also: Gold and silver price: మరింతపైకి పసిడి ధర.. ఈ రోజు రేట్లు ఇలా..

ఇక, వావిలేటి పాడులోని జగనన్న కాలనీలో పనులు సాగడం లేదు. నివాసయోగ్యంగా లేవు.. ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలి అని నిలదీశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. హౌసింగ్ కాలనీలకు భూమి సేకరించినా వారికి ఇంకా పరిహారం ఇవ్వలేదు.. సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ దగ్గరకు వెళితే ఆయన పట్టించుకోలేదని.. కూర్చోమని కూడా చెప్పలేదన్న ఆయన.. ఒక ఎమ్మెల్యేనే అధికారులు పట్టించుకోవడం లేదు.. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదన్నారు. పొదలకూరు రోడ్ లో ఒక పక్కే రోడ్ వేశారు.. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఇసుక కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. ఓవర్ లోడ్ వల్ల రహదారులు పాడైపోతున్నాయి.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.. పొట్టేపాలెం వద్ద వంతెన కావాలని అడిగినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం వంతెనకు అనుమతి వచ్చిందన్నారు.. కానీ, ఏమైందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో కొందరు ఐఏఎస్‌ అధికారుల వల్లే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదని ఆరోపించిన కోటంరెడ్డి.. అందుకే వాళ్లు టెండర్లు వేయడం లేదన్నారు.. అప్పటి పురపాలక మంత్రి బొత్సా సత్యనారాయణను ఆడిగాం.. ఆయన శాఖ మారినా పనులు మంజూరు కాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.