కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అయ్యవారిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. సర్పంచి ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి, చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచి నివాసంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు.
అయ్యవారిపల్లె గ్రామ సర్పంచి కె. రహంతుల్లా నివాసంపై వైసీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రహంతుల్లా తిమ్మయ్యగారిపల్లెలోని నివాసంలో నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు. గ్రామానికి మంజూరైన సిమెంట్ పనుల విషయంలో పంచాయతీ తీర్మానంపై సంతకాలు చేయలేదనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసినట్లు సర్పంచి వర్గం ఆరోపించింది. గాయపడిన కుటుంబసభ్యులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
