Site icon NTV Telugu

Andhra Pradesh: హిందూపురంలో వైసీపీ నేత దారుణహత్య.. వర్గపోరే కారణమని అనుమానం

Hindupuram

Hindupuram

Hindupuram YSRCP Leader Killed: హిందూపురం నియోజకవర్గంలో శనివారం రాత్రి దారుణహత్య చోటు చేసుకుంది. వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి (46) గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబా మూసేసి కారులో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. మొత్తం 18 చోట్ల విచక్షణ రహితంగా నరికి దుండగులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని చికిత్స కోసం స్థానికులు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Read Also: Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. విచారణకు మంత్రి ఆదేశం

ఐదుగురు వ్యక్తులు తమను గుర్తుపట్టకుండా మాస్కులు ధరించి రెండు బైక్‌లపై వచ్చారని, ఇద్దరు దుండగులు బైక్‌పైనే ఉండగా మిగతా ముగ్గురు రామకృష్ణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ హత్యకు వైసీపీలో వర్గపోరే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తన కుమారుడి హత్య వెనక ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్, హిందూపురం రూరల్ సీఐ ఉన్నారని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపించారు. రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వర్గీయులకు ఇటీవల వివాదం జరిగిందని, దీంతో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయని చెబుతున్నారు. బెదిరింపుల నేపథ్యంలో ఈ హత్య జరగడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. కాగా రామకృష్ణారెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన తాత రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version