NTV Telugu Site icon

Karanam Venkatesh: టీడీపీది ముగిసిన చరిత్ర.. మళ్లీ వైసీపీదే అధికారం..!

Karanam Venkatesh

Karanam Venkatesh

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది.. వైఎస్‌ జగన్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారు.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని విపక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే.. అధికార పార్టీ మాత్రం.. మరోసారే కాదు.. 25 ఏళ్ల పాటు వైఎస్‌ జగనే సీఎంగా ఉంటారంటోంది.. తాజాగా ఈ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్‌ కరణం వెంకటేష్‌… తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చరిత్ర ముగిసింది.. చంద్రబాబు వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని కామెంట్‌ చేశారు.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తోంది.. రూ. లక్షా 75 వేల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజల వద్దకు పంపిణీ చేశామన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ఎవరు తీసుకువెళ్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు కరణం వెంకటేష్.

Read Also: YS Jagan Mohan Reddy: పన్ను చెల్లింపులపై మరింత అవగాహన కలిగించాలి..!

ఇక, చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయమే జరిగిందని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్లుగా కేబినెట్‌ హోదాలో ఉన్న బాబు వల్ల ఎవరికైనా మంచి జరిగిందా..? అంటే ఆయన ప్రతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకే సమాధానం దొరకడం లేదన్నారు కరణం వెంకటేష్.. అందుకే కుప్పంలో తిరుగుబాటు జరుగుతోందన్నారు. బాబు ఏమీ చేయలేదని… వైఎస్‌ జగన్‌ వచ్చాకే అభివృద్ధి చేస్తున్నారనే ప్రజలకు అర్థమైంది.. దీంతో.. బాబుపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో 31 లక్షల మందికి ఇళ్లు ఇవ్వడమంటే అది చిన్న విషయం కాదని కరణం వెంకటేష్.. ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఇన్నేళ్ల అనుభవంలో చంద్రబాబు ఎందుకు ఇలాంటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయలేకపోయాడని నిలదీశారు. కేవలం మూడున్నర ఏళ్లలోనే సీఎం జగన్ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని, ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. చంద్రబాబు గానీ, లోకేష్ గానీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఒక మున్సిపాలిటీ గానీ, గ్రామ పంచాయతీ సీట్లను గానీ గెలుచుకోలేదని, వీళ్లు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారో ప్రజలే ఆలోచించాలని సూచించారు వెంకటేష్‌.

మరోవైపు.. రాష్ట్రంలో పొత్తుల కోసం జరుగుతోన్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కరణం వెంకటేష్‌.. ఈ రోజు పొత్తులు పెట్టుకుంటామంటారన్నారని, మరి గతంలో ఎలా ఉన్నారో కూడా చూడాలని సూచించారు.. 2014లో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన… 2017లో ఎలా తిట్టుకున్నారో, 2019లో విడిపోయి ఎలా పోటీ చేశారో అందరం చూశామని.. వాళ్లలో వాళ్లే తిట్టుకున్నారని, మళ్లీ ఇప్పుడు కలిసి వచ్చి డ్రామాలు వేస్తున్నారని మండిపడ్డారు. విడివిడిగా 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ము లేదు.. కానీ, అధికారంలోకి రావాలనే ఆశ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఆశ ఉంటే చాలదని, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల దీవెనలు ఉండాలని హితవు పలికారు. అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఉందని.. నాడు- నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న ప్రజల వద్దకే పాలన సీఎం వైఎస్‌ జగన్ ఆలోచనలకు ఒక ఉదాహరణ అంటూ ప్రశంసలు కురిపించారు కరణం వెంకటేష్.