సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్రకు సిద్ధమైంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. గతంలో జరిగిన సామాజిక అన్యాయం, గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని చాటి చెప్పేలా నేటి నుంచి ఈ నెల 29 వరకు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులతో ఈ బస్సు యాత్ర సాగనుంది.. ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రారంభమైన ఈ యాత్ర.. నగరాలు, పట్టణాలు, ప్రాంతాల మీదుగా 29వ తేదీన అనంతపురం వరకు సాగనుంది.. అనంతపురంలో బస్సు యాత్రను ముగించనున్నారు.. ఇక, ఈ యాత్ర సందర్భంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేశాయి వైసీపీ శ్రేణులు..
Read Also: London: యూకేలో తొలి దళిత మేయర్.. భారత సంతతికి చెందిన మహిళ రికార్డు
ఈ యాత్ర సందర్భంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30వ తేదీతో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల సామాజిక సాధికారతకు చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.. దీంతో.. ఈ యాత్రకు పూనుకున్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేస్తూ.. సామాజిక న్యాయం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదువులతో పాటు.. వివిధ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించారు. చట్టసభల్లో బడుగు, బలహీనవర్గాల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను క్షేత్రస్థాయిలో తెలియజేయనున్నారు.. రాష్ట్ర మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు ఉన్నారని.. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ అప్పగించారని నేతలు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన సామాజిక విప్లవాన్ని బస్సు యాత్రలో ఆయా వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రజలకు వివరిస్తారని నేతలు వెల్లడించారు.