ఏపీలో ఈనెలలోనే మరో పథకం అమలు కానుంది. ఈనెల 13న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఆర్ధిక సహాయం అందనుంది. సొంత వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు జమచేస్తామని రవాణాశాఖ కమిషనర్ పి.రాజబాబు వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్‌లకు సీఎం చేతుల మీదుగా ఈ ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, మరమ్మతుల నిమిత్తం నగదు సాయం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
Read Also: CM Jagan Vidya Kanuka: మూడో విడత జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఆదోనికి వరాల జల్లు
కాగా ఈ ఏడాదికిగాను అర్హుల నుంచి రవాణా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రవాణాశాఖ కమిషనర్ పి.రాజబాబు తెలిపారు. ఈ నెల 7లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు తమ వాహనం వద్ద ఫొటోను గ్రామ, వార్డు సచివాలయంలో అప్‌లోడ్ చేస్తే సరిపోతుందని సూచించారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారు మాత్రం తమ ఆధార్‌కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా సంబంధిత అధికారులు ఆమోదిస్తారని.. 10న దరఖాస్తులను కలెక్టర్లు ఆమోదించిన తర్వాత 11, 12 తేదీల్లో సీఎఫ్‌ఎస్‌ఎస్ ద్వారా సంబంధిత కార్పొరేషన్లకు పంపిస్తారని రాజబాబు వెల్లడించారు.