ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను ఈ నెల 16న రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు రైతు బ్యాంక్ అకౌంట్‌లో నేరుగా రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. ఈ ఏడాది మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.వీరిలో 47 లక్షల మంది భూ యజమానులు ఉండగా.. మిగతా 90 వేల మంది అటవీ సాగుదారులు ఉన్నారు.
ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం శుక్రవారం నుంచి రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించడంతో పాటు జాబితాలో చోటు దక్కని అర్హుల అభ్యర్థనలను అధికారులు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వారికి రైతు భరోసా సాయం అందించనున్నారు. కాగా ఇప్పటికే ఫైనల్ జాబితాను అధికారులు సిద్ధం చేయగా ప్రభుత్వం సోమవారం నాడు నిధులు విడుదల చేయనుంది.
కాగా ఏపీలో ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి-ఎఫ్‌ఏవో చాంపియన్ అవార్డుకు ఆర్బీకేలను నామినేట్ చేసిన కేంద్రం.. తాజాగా ఏషియన్ ఫసిపిక్ సమ్మిట్‌లో ఇథియోపియా కోసం ఆర్బీకేలను వరల్డ్ బ్యాంక్‌కు సిఫార్సు చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక చేయూతతో ఈ ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది.