Andhra Pradesh: నేడు ఏపీలోని రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన కింద వరుసగా నాలుగో ఏడాది రెండో విడత నిధులు జమ కానున్నాయి. ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 రైతు భరోసా సాయం, నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ మే నెలలో ఖరీఫ్‌కు ముందే రైతన్నలకు ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. నేడు రెండో విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి మరో రూ. 4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ. 2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. వచ్చే సంక్రాంతి రోజుల్లో ప్రతి రైతన్నకూ మూడో విడతగా మరో రూ.2 వేలను ప్రభుత్వం అందించనుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ.13,500 రైతు భరోసా సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా 50 లక్షలకు పైగా రైతన్నలకు ప్రతి ఏటా సుమారు రూ.7వేల కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,096.04 కోట్లతో కలిపి ఈ మూడేళ్ళ నాలుగు నెలల్లో జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా సాయం మాత్రమే రూ. 25,971.33 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్ రైతు భరోసాను ప్రభుత్వం అందిస్తోంది. విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
వర్గాల వారీగా వైఎస్సార్ రైతు భరోసా సాయం:
బీసీలు: 24,61,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 12,113.11 కోట్లు
ఎస్సీలు: 5,23,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 2,653.04 కోట్లు
ఎస్టీలు: 3,92,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 1,771.13 కోట్లు
మైనార్టీలు: 60,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 320.68 కోట్లు
కాపులు: 7,85,700 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 3,793.44 కోట్లు
ఇతరులు: 10,16,300 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 5,319.93 కోట్లు
మొత్తం: 52,38,000 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం రూ. 25,971.33 కోట్లు
