NTV Telugu Site icon

టీడీపీ తన బలాన్ని బీజేపీకి బదలాయించింది: సజ్జల

బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బద్వేల్ ఉప ఎన్నికలో చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఎన్నిక తమ బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఓడితే సమీక్షించుకోవడానికి, గెలిస్తే మరింత బాధ్యతగా పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని సజ్జల తెలిపారు.

Read Also: సీఎం జగన్ రికార్డును బద్దలు కొట్టిన మహిళ

మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై సజ్జల విమర్శలు చేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోయినా బీజేపీ అభ్యర్థిని తమ భుజాలపై మోసిందని ఆరోపించారు. జనసేన కూడా ఇదే రకంగా పనిచేసిందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బద్వేల్‌లో బీజేపీకి 800లోపే ఓట్లు వచ్చాయని, కానీ ఇప్పుడు బీజేపీకి 20వేల ఓట్లు రావడంతో టీడీపీ తన బలమంతా బీజేపీకి బదలాయించిందని సజ్జల విమర్శలు చేశారు. తెరచాటున టీడీపీ, బీజేపీ కలిసి పనిచేశాయని అర్థమవుతోందని సజ్జల వ్యాఖ్యానించారు.