MLC Lella AppiReddy: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, వ్యవస్థలను పతనం చేసి గెలిచారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఓటింగ్ కు ముందు పోలింగ్ కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళానికి గురి చేశారని పేర్కొన్నారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.. వైసీపీకి కేవలం 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ కి 35 ఫిర్యాదులు చేశాం.. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం.. అయినా కూడా ఎన్నికల కమీషన్ ఎందుకు పట్టించుకోలేదు? అని క్వశ్చన్ చేశారు. హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చా, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది అని లేళ్ల అప్పిరెడ్డి గుర్తు చేశారు.
ఇక, ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైసీపి అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే, ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు అన్నారు. జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు.. ఎన్నికల కమీషన్ ప్రజల ముందు దోషిగా నిలపడింది.. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని లేళ్ల అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు.
