AP High Court: తెలుగుదేశం పార్టీకి చెందిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి మేయర్ సురేష్బాబు నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్కు లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మాధవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్ లేనే లేదని ధర్మాసనం విస్పష్టం చేసింది. కార్పొరేషన్ తీర్మానాలపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేసింది. కడప మునిసిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది జూన్ 20న చేసిన తీర్మానాలను రద్దు చేస్తూ మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధించింది. సింగిల్ ‘జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంది.
అలాగే ప్రజా ప్రయోజనాల నిమిత్తం కార్పొరేషన్ తీర్మానాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల్లో సైతం జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలపై అభ్యంతరాలుంటే ఆ విషయాన్ని కమిషనర్ లేదా ఎవరైనా కౌన్సిలర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం సుమోటోగా స్పందించవచ్చునని స్పష్టం చేసింది. అంతే తప్ప నేరుగా కమిషనర్కు కార్పొరేషన్ తీర్మానాలను రద్దు చేసే అధికారం మాత్రం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
