MLA Arava Sridhar controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ అంతర్గత విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన విచారణ కమిటీ నేడు, రేపు రైల్వే కోడూరులో పర్యటించనుంది. బాధితురాలు వీణా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై NGRCను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వీణా విడుదల చేసిన వీడియోలు, వాటిలో ఉన్న అంశాలను విచారణ కమిటీ సేకరిస్తోంది. అలాగే అసెంబ్లీలో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన సందర్భానికి సంబంధించిన వీడియో వివరాలపై కూడా కమిటీ దృష్టి సారించింది.
ఇప్పటికే ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో జనసేన పార్టీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో విచారణ కమిటీ బాధితురాలు వీణాతో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అలాగే ఘటనకు సంబంధించిన మరికొందరిని కూడా కలవనుంది. వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలతో కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా, నిన్న జరిగిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కూడా ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
