Site icon NTV Telugu

Kadapa : కడప జిల్లాలో ఉప ఎన్నికల హీట్.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..

By Election

By Election

Kadapa : కడప జిల్లాలో ఇప్పుడు ఉప ఎన్నికలు హీట్‌ పెంచుతున్నాయి.. సిట్టింగ్ జడ్పీటీసీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఉప ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ.. ఇలా కడప జిల్లాలో రెండు ZPTC స్థానాల కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కడప జిల్లాలోని 50 జడ్పీటీసీ స్థానాలకు గత ఎన్నికల్లో వైసీపీ 49 దక్కించుకుంది. టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, పులివెందుల జడ్పీటీసీ చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఒంటిమిట్ట ZPTC ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 2న పరిశీలన.. 5న ఉపసంహరణ ఉంటుంది. వచ్చేనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు ప్రకటిస్తారు.

Read Also: Elon Musk Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అద్భుతం.. పక్షవాతానికి గురైన మహిళ 20 ఏళ్ల తర్వాత రాయగలిగింది

అయితే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ జడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. పులివెందులలో ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ, ఒంటిమిట్ట స్థానానికి మాత్రం తీవ్ర పోటీ ఉంటుందని లెక్క కడుతున్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీ కాగా.. ఇటు రెండు పార్టీలు గెలుపు కోసం వ్యూహరచనల్లో మునిగిపోయాయి. మొత్తానికి కడపలో ఈ రెండు స్థానాల్ని ఏపార్టీ దక్కించుకున్నా అది రికార్డే అవుతుందన్న చర్చ లోకల్‌గా సాగుతోంది.

Exit mobile version