Site icon NTV Telugu

Mayor Suresh Babu: కడప మేయర్‌కు షాక్‌.. అనర్హత వేటు వేసిన ప్రభుత్వం..

Kadapa Mayor Suresh Babu

Kadapa Mayor Suresh Babu

Mayor Suresh Babu: కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంలో మేయర్ సురేష్‌ బాబుపై ఫిర్యాదులు వచ్చాయి.. ఈ వ్యవహారంలో మంగళవారం రోజు మేయర్ సురేష్‌బాబును విచారించారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ… ఇక, తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ కోసం రెండు వారాల గడువు కోరారు సురేష్‌ బాబు.. కానీ, మేయర్ వివరణపై సంతృప్తి చెందని ప్రభుత్వం.. అతడిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది..

Read Also: BCCI: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ గుడ్‌న్యూస్..

కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం విదితమే.. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంపై కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధిగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో నీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న కడప మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే మేయర్ ఆ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు గడువు పెంచిన కోర్టు.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మేయర్ సురేష్ బాబు.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. సంతృప్తి చెందని ప్రభుత్వం కడప మేయర్‌ సురేష్‌ బాబుపై అనర్హత వేటు వేసింది..

Exit mobile version