కుల గణన డిమాండ్‌కు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తప్పనిసరిగా అమలు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మిళిత, సుస్థిర, సమాన అభివృద్ధి సాధించాలంటే సామాజిక న్యాయానికి అవసరమైన సరైన డేటా ఉండాలని పేర్కొంటూ, ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2027 గణనలో కీలక అంశాలు ఉండాలి
కుల గణనకు సంబంధించిన డిమాండ్లు సహేతుకమైనవని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 2027లో చేపట్టే కుల గణనలో ఓబీసీ, బీసీల కోసం తప్పనిసరిగా ప్రత్యేక కుల కాలమ్ ఉండాలని సూచించారు. గణన ప్రక్రియలో ఏ కులం కూడా విస్మరించబడకుండా చూసేందుకు సమగ్ర కుల డ్రాప్-డౌన్ మెనూ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలియజేసే సూచికలను కూడా చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
సంక్షేమం, విధానాలకు కీలకం
సమగ్రమైన, సమ్మిళిత కుల గణన డిమాండ్‌ను వైసీపీ ఎప్పటినుంచో సమర్థిస్తోందని, ఈ విషయంలో పార్టీ గట్టిగా కట్టుబడి ఉందని వైఎస్ జగన్ తెలిపారు. విధానాల రూపకల్పనకు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ డేటా అత్యవసరమని ఆయన నొక్కిచెప్పారు.

