తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ శాఖ పరిధిలోని వివిధ కార్యక్రమాల్ని సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని.. గుంతలు లేని రోడ్లు కనిపించాలని సూచించారు. రాజధానిలో కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లేఅవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని.. నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ తప్పనిసరిగా పాటిస్తూ ఈ నిర్మాణాలు ఉండాలని చెప్పారు. వివాదాలు, ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకి అందించాలన్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై కూడా సమీక్షించిన సీఎం.. వనరుల సమీకరణపై అధికారులతో సమాలోచనలు చేశారు. సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రతిపాదన చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. అలాగే ప్రస్తుతమున్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, స్టేషన్లలో కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతర వివరాల్ని సమర్పించాలని సీఎం తెలిపారు. పర్యావరణ విధానాలకూ పెద్దపీట వేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే అధికారులు స్పీడ్ యాక్సెస్ రోడ్డుపైన దృష్టి పెట్టామని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. అటు, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కోసం అర్బన్ నియోజకవర్గాల్లో 6,791 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్ఆర్, కర్నూలు, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మొత్తం 864.29 ఎకరాల్లో లేఅవుట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. మే చివరి నాటికి ఇవి సిద్ధమవుతాయని, అలాగే రోడ్ల పనులు జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
